స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిగా, మహాత్ముడి తీపి గుర్తుగా, వేలమంది ప్రయాణికుల కలల మార్గంగా, సరుకు రవాణాలో తిరుగులేని చిహ్నంగా విజయవాడ రైల్వేస్టేషన్ ఎన్నో మైలురాళ్లను దాటింది. నానాటికీ వేగాన్ని పెంచుకుంటూ ప్రస్తుతం 94వ పడిలోకి వచ్చి ఆగింది. అంతేకాదు.. 75 వసంతాల స్వాతంత్య్ర దీప్తిగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన 75 రైల్వేస్టేషన్లలో ఏ1 హోదాకు గ్రీన్‌సిగ్నల్ పొందింది. జాతీయోద్యమంతో మమేకమైన ఈ రైల్వేస్టేషన్ ప్రస్తుతం ఆజాదీ కా ఐకానిక్ వారోత్సవాలతో ‘పట్టా’భిషేకం జరుపుకొంటోంది. ఈ క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్ ప్రస్థానాన్ని ఓసారి పరికిస్తే..
దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ. మొదట్లో చిన్న షెడ్డుగా ఏర్పడింది. ఆ తరువాత 1928లో పాత రైల్వేస్టేషన్ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న రైల్వేస్టేషన్ 1979, జనవరి 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది మొత్తం పది ప్లాట్‌ఫాంలతో కూడిన అతిపెద్ద జంక్షన్. అలాగే, ఇక్కడి రూల్ రిలే ఇంటర్ లాకింగ్ క్యాబిన్‌ను 1976, జనవరి 24న ఏర్పాటు చేశారు. దేశంలో సరుకు రవాణాకు సంబంధించి ‘ర్యాపిడ్ ఇండస్ర్టియల్ డెవలప్‌మెంట్’ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఈ రైల్వేస్టేషన్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం సరుకు రవాణాలో దేశంలోనే తిరుగులేని డివి జన్‌గా విజయవాడ కొనసాగుతోంది. విజయవాడ మీదుగా రోజూ మొత్తం 400 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
మహనీయుడి పాదస్పర్శతో పునీతం
జాతిపిత మహాత్మాగాంధీ విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఏడుసార్లు సందర్శించారు. 1921లో వచ్చినపుడు రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సమయంలో కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య మువ్వన్నెల పతాకాన్ని గాంధీజీకి అందించారు. ఇక చివరిగా మహాత్ముడు 1946, జనవరి 21లో ప్రత్యేక రైలులో విజయవాడ వచ్చారు.
విజయవాడ రైల్వే డివిజన్‌గా..
సదరన్ రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్ 1966లో ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భావంలో భాగంగా ఈ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైనదిగా భాసిల్లుతోంది. దేశంలోనే భారీ ఆదాయాన్ని ఇచ్చి, నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం విజయవాడ డివిజన్ 1,068.194 రూట్ కిలోమీటర్ పొడవున వ్యాపించి ఉంది. డివిజన్ పరిధిలో మొత్తం 156 రైల్వేస్టేషన్లు ఉండగా, విజయవాడ ఏ1గా కీర్తి గడించింది. చెన్నై-న్యూఢిల్లీ నార్త్-సౌత్ రూట్, చెన్నై-హౌరా ఈస్ట్-కోస్ట్ రూట్‌ల వల్ల ఇది ట్రై జంక్షన్‌గా మారింది. ఈ రైల్ రూట్లు విజయవాడ పరిధిలో గుంటూరు/గుంతకల్, మచిలీపట్నం/నర్సాపూర్ మీదుగా వెళ్తాయి. అలాగే, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు దీని పరిధిలోనే ఉన్నాయి.