తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో మొదటిసారిగా ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాలకు ఒక రోజు ముందు సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించనున్నామని టీటీడీ వేద పండితులు తెలిపారు.మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, చివరి రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిస్తాయని వివరించారు. ఆగస్టు 23న ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని వెల్లడించారు.
*తిరుచానూరులో ఘనంగా కాలభైరవ అష్టమి వేడుకలు తిరుపతి రూరల్ మండలం పరిధిలోని తిరుచానూరు యోగి మల్లవరంలో నీ శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో అష్టమి సందర్భంగా బుధవారం కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో స్వామి వారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ఎదుట గుమ్మడికాయ దీపాలు పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు. అంతకమునకు ఉత్సవమూర్తులు ఆలయంలో ఊరేగింపు నిర్వహించారు.
*ఆగస్టు 2 నుంచి శ్రీ వీరభద్రస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2 నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు కొనసాగుతాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం ప్రసాదాలుగా అందజేస్తారు.ఆగస్టు 2 వ తేదీన సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఆగస్టు 3వ తేదీ బుధవారం సాయంత్రం సింహవాహనం, ఆగస్టు 4 గురువారం సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 5 శుక్రవారం సాయంత్రం శేష వాహనం, ఆగస్టు 6 శనివారం రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు.ఆగస్టు 7 ఆదివారం సాయంత్రం గజవాహనం, ఆగస్టు 8 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆగస్టు 9 మంగళవారం సాయంత్రం 5 గంటలకు వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, ఆగస్టు 10 బుధవారం ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.