Business

దేశంలో ప్లాట్లకు యమ గిరాకీ!

దేశంలో ప్లాట్లకు యమ గిరాకీ!

కొవిడ్‌ కాలంలోనూ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఓపెన్‌ ప్లాట్లకు గిరాకీ పెరిగింది. గత రెండున్నర సంవత్సరాల్లో వీటి ధరలూ సగటున 38 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రె్‌సవే సమీపంలోని ప్లాట్లకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. ఈ ప్రాంతంలో గత రెండున్నర సంవత్సరాల్లో ఎస్‌ఎఫ్‌టీ ధర సగటున 38 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఓపెన్‌ ప్లాట్ల ఎస్‌ఎ్‌ఫటీ రూ.2,300 నుంచి రూ.4,500 వరకు పలుకుతున్నాయి. కాగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ల్లోనూ ఓపెన్‌ ప్లాట్లకు గిరాకీ అదే స్థాయిలో ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ గురువారం నాడు విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2019 డిసెంబరుతో పోలిస్తే ఈ ధరలు సగటున 38 శాతం ఎక్కువ అని పేర్కొంది.

హైదరాబాద్‌లోనూ జోరుగా…
కొవిడ్‌ కారణంగా గత ఏడాది సెప్టెంబరు వరకు హైదరాబాద్‌ రియల్టీ అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ కాలంలోనూ ఇన్వెస్టర్లు ఓపెన్‌ ప్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్‌, ఆదిభట్ల, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు హాట్‌కేకుల్లా మారాయి. 2019 డిసెంబరుతో పోలిస్తే, ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్ల ధరలు వరుసగా 21 శాతం, 24 శాతం, 26 శాతం వరకు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితమైన ఐటీ రంగం ఇప్పుడు నగరం నలుదిశల అభివృద్ధి చెందుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.