Sports

రంజీ విజేతలకు ప్రైజ్ మనీ పెంపు

Auto Draft

కరోనా కారణంగా రెండేండ్ల పాటు కుంటుపడిన దేశవాళీ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నడుం కట్టింది. ఈ మేరకు గురువారం ముంబైలో ముగిసిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. గడిచిన మూడేండ్లుగా కరోనా వల్ల ఆగిపోయిన దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లను ఈ ఏడాది నుంచి మళ్లీ నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. దీంతోపాటు ఘనచరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ విన్నర్లకు అందజేసే నగదు బహుమతని పెంచాలని నిర్ణయించింది.

ప్రస్తుతం రంజీ విజేతలకు క్యాష్ ప్రైజ్‌గా రూ. 2 కోట్లు అందుతున్నది. దీనిని పెంచాలని అపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే పెంపు ఎంతమేరకు ఉంటుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. బీసీసీఐకి ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా (రూ. 48,390 కోట్లు) ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశవాళీ క్రికెట్‌ను సంస్థాగతంగా చక్కదిద్దేందుకు ప్రయత్నాలను మమ్మురం చేసింది.అంతేగాక కరోనా మహమ్మారి వల్ల గత రెండేండ్లుగా వాయిదా పడ్డ దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్, సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను ఇకనుంచి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దేశవాళీ సీజన్‌ను బిజీగా మార్చేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

రంజీలలో డీఆర్ఎస్..
దేశవాళీ క్రికెట్‌ను పటిష్టం చేయడంతో పాటు రంజీలలో డిసీషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. గడిచిన కొన్నాళ్లుగా రంజీలలో డీఆర్ఎస్‌ను ప్రవేశపెట్టాలని బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో బోర్డు ఈ దిశగా ముందడుగు వేసింది.