ఈరోజుల్లో ప్రయోగాలు చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. కళలు, వాటి వైభోగం.. అంటూ మాట్లాడితే మరీ సందేశాలు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ.. దేశ సంస్కృతిలో భాగమైన నాట్యం గురించో, సంగీతం గురించో ఎవరూ మాట్లాడకపోతే ఎలా? చాలా కాలంగా శాస్ర్తియ నృత్యం ఆధారంగా సినిమాలేవీ రావడం లేదు. ఆ లోటు తీర్చిన చిత్రం ‘నాట్యం’. ‘సత్యం’ రామలింగరాజు కోడలు సంధ్యారాజు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రమిది. ఆమె కూచిపూడి కళాకారిణి. ఆమెకు తగ్గట్టుగానే ‘నాట్యం’ కథని రూపొందించారు. శాస్ర్తీయ నృత్యం తెలిసిన నటి కాబట్టి.. ఆమె అభినయం అత్యంత సహజంగా కనిపించింది. నటిగా సంధ్యారాజుకి మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకోలేదు గానీ, మంచి చిత్రంగా ప్రేక్షకుల మనన్న పొందింది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులూ వచ్చాయి. ఉత్తమ కొరియోగ్రఫీ (సంధ్యారాజు), ఉత్తమ అలంకరణ (టీవీ రాజు) విభాగాల్లో అవార్డులు వచ్చాయి. రేవంత్ కోరుకోండ ఈ చిత్రానికి దర్శకుడు.