పెద్ద సంఖ్యలో సగటు ప్రవాసీ కార్మికులు నివసిస్తున్న గల్ఫ్ దేశాల్లో బలోపేతం కావడానికి తెలుగుదేశం పార్టీ చురుకుగా ప్రయత్నాలు చేస్తుంది. గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ దేశాలలో పని చేస్తున్న సుమారు అయిదు లక్షలకుపైగా రాష్ర్టానికి చెందిన ప్రవాసీయులు, అంతకంటె ఐదింతల సంఖ్యలో వారిపై ఆధారపడిన స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులను పార్టీవైపు నడిపించె దిశగా తెలుగుదేశం ప్రయత్నం చేస్తోంది. ఈమేరకు గల్ఫ్‌లో టీడీపీ అధ్యక్షుడిగా సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త రావి రాధాకృష్ణను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన ఇంజినీర్ అయిన రాధాకృష్ణ ప్రపంచంలోకెల్లా అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ ఆరంకోకు సుదీర్ఘ కాలంగా కంట్రాక్టర్‌గా ఉన్నారు. సౌదీ అరేబియాలో విదేశీ పెట్టుబడిదారుడిగా ఉన్న ఏకైక తెలుగు వ్యక్తి అయిన రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడు. సౌదీతో పాటు గల్ఫ్‌లోని ఇతర దేశాలలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ ఉంటారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గం నుండి ఆయన సతీమణి దీపిక పేరు కూడా ఒక దశలో పరిశీలనకు వచ్చింది.