* సాగు మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల కలిగే లబ్ధిని రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని రైతులకు తెలియజేస్తూ ఈమేరకు లేఖలు రాయాలని పేర్కొన్నారు. పంపుసెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
* కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటు విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని పరిమితం చేయాలన్న ఉద్దేశంతో పెట్రోల్‌లో ఇథనాల్ (Ethanol) వినియోగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ఇది 10 రెట్లు పెరిగినట్టు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వెల్లడించారు. 2004లో పెట్రోల్‌లో 40కోట్ల లీటర్ల ఇథనాల్ కలపగా.. తాజాగా అది 400 కోట్ల లీటర్లకు పెరిగిందన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరిగిందని మోదీ వెల్లడించారు.
* తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఈవో ధర్మారెడ్డి జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
* అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, కీలక షేర్ల రాణింపుతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. గురువారం ఆద్యంతం మదుపర్లు తగ్గేదే లే అన్నట్లుగా కొనుగోళ్లకు దిగారు. సమయం గడుస్తున్న కొద్దీ కొత్త ఇంట్రాడే గరిష్ఠాలకు చేరి మదుపర్లను గత రెండు రోజుల వరుస నష్టాల నుంచి మార్కెట్లు గట్టెక్కించాయి. ఫెడ్ నిర్ణయాలపై వివిధ అంచనాల నేపథ్యంలో గత రెండు రోజులుగా అప్రమత్తత పాటించిన మదుపర్లకు ఎట్టకేలకు ఈరోజు ఉపశమనం దొరికింది.
* ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (Spicejet) షేర్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఓ దశలో కంపెనీ షేర్లు రెండేళ్ల కనిష్ఠానికి చేరాయి. తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. రాబోయే 8 వారాల పాటు 50 శాతం విమానాలు మాత్రమే నడపాలంటూ డీజీసీఏ ఆదేశించిన నేపథ్యంలో కంపెనీ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇంట్రాడేలో 10 శాతం మేర కోల్పోయిన స్పైస్‌జెట్ షేరు విలువ బీఎస్‌ఈలో రూ.34.75 వద్దకు చేరింది. చివర్లో కాస్త కోలుకుని 2.61 శాతం నష్టంతో 37.30 వద్ద స్థిరపడింది.
* సిరాజ్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై చివరి వన్డేలో అదరగొట్టిన సిరాజ్..ఇప్పుడు విండీస్ సిరీస్‌లోనూ చెలరేగాడు. పదునైన స్వింగ్, పేస్‌తో అక్కడ టాప్ క్లాస్ బ్యాటర్లు బెయిర్‌స్టో, రూట్‌లను పెవిలియన్‌కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, బుధవారం విండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో నిప్పులు చెరిగే బంతులను సంధించి విండీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఔట్ చేశాడు.
* రాష్ట్రపతిపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి దారితీసింది. రంజన్ వ్యాఖ్యలపై అధికార భాజపా తీవ్రంగా మండిపడింది. ప్రథమ పౌరురాలిని అగౌరపర్చినందుకు గానూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటూ కాషాయ పార్టీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై అధిర్ రంజన్ స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని, ఈ వివాదంలోకి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.
* ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. యువకులు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండినవారికే ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా.. తాజా నిర్ణయంతో 17ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయ్యింది.
* కామన్వెల్త్ క్రీడల గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బ్రిటన్ పరిపాలనలో ఉన్న దేశాలన్నీ కలిసి కామన్వెల్త్ దేశాలుగా ఏర్పడ్డాయి. ఈ దేశాల మధ్య నాలుగేళ్లకోసారి క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు. అన్ని క్రీడా విభాగాల్లో స్త్రీ, పురుషులకు సమానంగా పోటీలుంటాయి. 1998లో క్రికెట్ పోటీలు నిర్వహించగా తర్వాత నిలిపివేశారు. తాజాగా మహిళల క్రికెట్ ఈ కామన్వెల్త్ క్రీడల్లో భాగమైంది. ఇవాళ్టి నుంచి (జులై 28) నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.
* అగ్రదేశం అమెరికా, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అణు బెదిరింపులకు దిగారు. ఆ దేశాలతో ఎలాంటి సైనిక ఘర్షణనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 2017 తర్వాత మొదటిసారి ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షకు దిగుతుందన్న అంచనాల మధ్య కిమ్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ మేరకు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) వెల్లడించింది. కొరియా దేశాల మధ్య యుద్ధం ముగింపు 69వ వార్షికోత్సవం సందర్భంగా నియంత నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి.