DailyDose

‘గాంధీ కన్నా గోప్పోడివా!’ జవహర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం

‘గాంధీ కన్నా గోప్పోడివా!’ జవహర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం

కోర్టు ధిక్కరణ కేసు విచారణకు గైర్హాజరైన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం ఉందనే కారణంతో గైర్హాజర్ అవుతారా? కోర్టు ముందు హాజరు అయ్యే సమయం లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు ఉంటాయి? సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకు ఎన్ని గంటలు సమావేశాలలో పాల్గొంటారు సీఎం పేషీ నుంచి వివరాలు తెప్పించి వాస్తవాలు తేల్చమంటారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ తదితర మహోన్నత వ్యక్తులూ న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి కోర్టులో హాజరయ్యారు. వారికన్నా మీరు గొప్పవారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జవహర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమై ఎన్నింటికి ముగుస్తుందనే కనీస వివరాలు లేవని తీవ్రంగా ఆక్షేపించింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని న్యాయస్థానం గుర్తిస్తే వివరణ తీసుకోకుండా నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించక పోతే ఏమీ కాదులే అనే భావనతో ఉండొద్దని హితవు పలికింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయజులు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.