ఇంద్రకీలాద్రి పై శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కావడంతో అమ్మవారిని కొలిచేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా నాలుగో శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి. టికెట్ ధర రూ.1500. ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆగస్టు 15 నుంచి ఆధార్ కార్డుతో ఆలయంలో నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
2. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట
కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలను ఈసారి ఆలయ మాడవీధుల్లో నిర్వహిస్తున్న క్రమంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో కేవలం సర్వదర్శనాలను (ఉచిత దర్శనాలు) మాత్రమే అమలు చేస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆయా రోజుల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను పూర్తిస్థాయిలో రద్దు చేశామని.. స్వయంగా వచ్చిన ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు. తిరుమలలో ఆయన.. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు
3. సత్యదేవుడికి వజ్రకిరీటం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి శిగలోకి మరో ఆభరణం చేరనుంది. పెద్దాపురం లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు సత్యదేవుడికి వజ్రకిరీటాన్ని చేయించారు. 656.354 గ్రాముల బరువుగల ఈ కిరీటాన్ని వజ్రాలు, కెంపు, పచ్చలతో రూ.కోటిన్నర ఖర్చుతో తయారు చేయించారు. దీనిని శుక్రవారం దేవస్థానం అధికారులకు అందజేయనున్నారు.
4. రామయ్య సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధి లో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తయారు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం లక్ష్మీ అష్టోత్తర పారాయణం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు.
5. రాజన్న ఆలయంలో శ్రావణమాసం ప్రారంభం
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం లో శ్రావణమాసం ప్రారంభమైంది. వేకువజాము నుంచే స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవారికి నెల రోజులపాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు. దేవస్థానం అనుబంధ ఆలయం అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక వసతులు కల్పించారు
*6. ప్రపంచ శాంతి కోసం జపాన్ భక్తుల యాగంt
తిరువణ్ణామలై సమీపం దేవానంపట్టు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో ప్రపంచ శాంతి ని కోరుతూ జపాన్ కు చెందిన భక్తులు ప్రత్యేక యాగం నిర్వహించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, అన్ని ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురిసి పంటలన్నీ సక్రమంగా పండాలని కోరుతూ వీరు ఈ యాగాన్ని జరిపారు. ఈ యాగంలో జపాన్‌కు చెందిన షాకికో ఒషి, చాయా ఒషి, మాస్కో ఒషి సహా పదిమందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ యాగాన్ని మరక్కాణం ప్రాంతానికి చెందిన జపాన్ పౌరసత్వం కలిగిన పండితుడు సుబ్రహ్మణ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దేవానంపట్టు గ్రామానికి చెందిన భక్తులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. యాగం పూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు.
7. శ్రీనివాస సేతు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి : టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికులు, నగరవాసుల సౌకర్యార్థం తిరుపతి నగరంలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులను కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, జేఈవో వీరబ్రహ్మం ఇతర అధికారులతో శ్రీనివాస సేతు పనుల పురోగతిపై ఈవో సమీక్ష నిర్వహించారు.ఈవో మాట్లాడుతూ మంగళం రోడ్డు నుంచి లీలామహల్ సర్కిల్ అప్రోచ్ రోడ్డు పనులను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని కోరారు. లక్ష్మీపురం సర్కిల్ నుంచి రామానుజ సర్కిల్ వరకు జరుగుతున్న పనులను ఆగస్టు నెలలో పూర్తి చేయాలన్నారు.రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రాస్ వద్ద నుంచి జరుగుతున్న పనులను మూడు వారాల్లో పూర్తిచేసి నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
8. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 11 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా వీరికి 7 గంటల్లో దర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 67,364 మంది భక్తులు దర్శించుకోగా 25,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.21 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
9. యాదాద్రి క్షేత్రంలో వచ్చే నెల 27 వరకు ఉత్సవాలు
*తొలిరోజు విష్వక్సేనారాధన, స్వస్తివాచనంతో శ్రీకారం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో నేటి నుంచి శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 27వరకు వివిధ కార్యక్రమాలు జరుపనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
*భక్తులందరికీ చేరువ కావాలనే..
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం లక్ష్మీ అమ్మవారు భక్తులందరికీ చేరువ కావాలని, అభయం ఇవ్వాలన్న సంకల్పంతో కోటికుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టామని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. భక్తజన మహిళా సౌభాగ్యం, లోక కల్యాణం, విశ్వశాంత్యార్థం, క్షేత్ర అభివృద్ధి, మహామంత్ర శక్తి సమర్పణం, యంత్రశక్తి ఉద్దీపనలు అనుసరించి 30 రోజులపాటు కుంకుమార్చన నిర్వహించనునన్నట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు చెప్పారు. కోటికుంకుమార్చనలో భక్తులకు అభయ వరప్రదానం జరుగుతుందని, ప్రపంచ మహిళామణుల సౌభాగ్యమంతా స్థిరీకరణ జరిగి రుణ బాధలు తొలగిపోతాయని అన్నారు. శ్రావణమాసం అమ్మవారికి అభీష్టం కావడంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని దీక్షితులైన అర్చకవర్యులు నియమనిష్టలతో చేపట్టనున్నారని, కోటి కుంకుమార్చనతో మంత్ర, యంత్ర, తంత్ర శక్తి పెరిగి త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి అత్యద్భుతమైన మహత్యం ఆపాదించబడుతుందని వివరించారు.
*1,400 మంది దంపతుల పేరిట సంకల్పం
కోటి కుంకుమార్చనలో పాల్గొనే దంపతులకు రూ. 2,000 ప్రవేశ రుసుం ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్ర నామాలు పేరిట సంకల్పం చేస్తారు. ఇలా 30 రోజులపాటు సంకల్పం నిర్వహిస్తారు. పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం, లక్ష్మి అమ్మవారి కుంకుమ ప్రసాదం అందజేస్తారు. వీటితోపాటు స్వయంభూ నరసింహ స్వామి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఇప్పటివరకు సుమారు 1,400 మంది దంపతులు కుంకుమార్చనకు బుకింగ్ చేసుకున్నారు.
*ఏర్పాట్లు పూర్తి
కోటి కుంకుమార్చనకు ప్రాకార మండపంలో విద్యుద్దీపాలు, కొబ్బరిమట్టలు, అరటి ఆకులతో అలంకరించారు. భక్తులు కూర్చునే విధంగా ఎర్ర తివాచీ పరిచారు. సంకల్పం వినిపించే విధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మండపంలో లక్ష్మి అమ్మవారి ప్రతిమను వేంచేపు చేశారు. కోటి కుంకుమార్చనకు రావాలని జిల్లా మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆలయ ఈఓ ఎన్. గీత ప్రత్యేకంగా ఆహ్వానించారు. మొదటి రోజు కలెక్టర్ పమేలా సత్పతి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ పాల్గొననున్నారు.
*30 మంది రుత్వికులతో..
శుక్రవారం నుంచి ఆగస్టు నెల శ్రావణ బహుళ అమావాస్య 27వ తేదీ వరకు శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు విష్వక్సేనారాధన, స్వస్తివాచనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ మహాకార్యంలో 30 మంది రుత్వికులు, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు పాల్గొని రోజుకు అమ్మవారి నామాన్ని 3.60 లక్షల సార్లు జపిస్తారు. ఇలా 30 రోజుల వరకు ఒక కోటి 8లక్షల నామస్మరణ పూర్తి చేస్తారు.