* ఆంధ్రప్రదేశ్‌లోని అనాకపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో నిన్న గల్లంతైన 7గురిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరిని రక్షించగా నిన్న ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. చివరగా జశ్వంత్ (నర్సీపట్నం) మృతదేహం తంతడి తీరంలో లభ్యం కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.
*శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ సిగరెట్ల పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. సిగరేట్లను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారివద్ద 22,600 సిగరెట్లతో పాటు 940 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.66 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*ఏలూరు జిల్లాలో 350 కిలోల గంజాయి స్వాధీనం
ఏపీలోని ఏలూరు జిల్లాలో పోలీసులు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమల మండలం కప్పలకుంట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి స్మగ్లర్లు ఇన్నోవా కారును వదిలిపెట్టి పారిపోయారు. కారును సోదా చేయగా అందులో ఉన్న 350 కిలోల గంజాయిని కారును స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
* గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద మూడు గ్రాముల కొకైన్, 5.491 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల మత్తుమందును గుర్తించారు. దీంతో నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన శబరీష్‌గా గుర్తించారు. కాగా, గచ్చిబౌలికి చెందిన లోకేశ్ చంద్ర అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
*మొబైల్ ఫోన్లు చోరీ చేసేందుకు ఒక దొంగ రాత్రంతా షోరూమ్‌లోనే ఉన్నాడు. ఉదయం శుభ్రం చేసేందుకు షాప్‌ను తెరువగానే దొంగిలించిన ఫోన్లతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పోలీసులు చాకచక్యంగా ఆ దొంగను పట్టుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జేపీ నగర్‌లోని టాటా క్రోమ్ స్టోర్‌లోకి చొరబడిన ఒక దొంగ గురువారం రాత్రంతా అక్కడ నక్కి ఉన్నాడు. ఆరు ఖరీదైన సెల్‌ఫోన్లను చోరీ చేశాడు. మరునాడు ఉదయం షాపు తెరిచిన సిబ్బంది క్లీన్ చేస్తుండగా అక్కడి నుంచి పారిపోయాడు.
*వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏషియన్ పేయింట్స్ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. చూస్తుండగానే మంటలు మరో మూడు ఫర్నీచర్ గోదాములకు మంటలు విస్తరించాయి.
* సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ శనివారం అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది.
* జగిత్యాల : జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో భారీ పిడుగు పడింది. బండారి గిర్ని వెనుకాల పిడుగు పడటంతో.. చాలా మంది ఇండ్లలో ఉన్న టీవీలు, అడాప్టర్‌లో కాలిపోయాయి. ఓ ఇంటి పైకప్పు గోడ పగిలిపోయింది. టీవీలు, అడాప్టర్‌లు కాలిపోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పిడుగు పడిన ప్రాంతాన్ని స్థానికులు పరిశీలించారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు తమ టీవీలను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బంద్ చేసి ఉంచాలని అధికారులు సూచించారు.
* వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏషియన్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గోదాం అంతటా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గోదాం పక్కనే ఉన్న ఎన్ ఇంటిరీయర్ ఫర్నీచర్ దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. ఈ రెండు దుకాణాలకు సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
*మర్రిపాడులో దివ్యాంగుడు తిరుపతి ఆత్మహత్య పోలీసులు చర్యలు చేపట్టారు. తిరుపతి సూసైడ్ కేసులో నలుగురిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మర్రిపాడు ఎస్‌ఐ వెంకటరమణ, ఏఎస్ఐ జయరాజ్, కానిస్టేబుళ్లు చాంద్‌బాషా, సంతోష్‌కుమార్‌ను సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు.
*ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట జాతీయ రహదారిపై భారీగా గంజాయి(Cannabis)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇన్నోవా కార్లో గంజాయిని తరలించేందుకు యత్నించారు. కాగా కప్పలకుంట వద్ద పంచర్ అవడంతో కారును ఆపారు. అదే సమయంలో అక్కడకు వచ్చి పెట్రోలింగ్ పోలీసులను చూసిన నిందితులు కారును వదిలి పరారయ్యాడు. సుమారు 350 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*పూడిమడక సముద్రతీరంలో మరో 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. నేవీ హెలికాప్టర్ సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించినట్లు చెప్పారు. మృతులు జగదీష్, గణేష్‌గా గుర్తించారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. విశాఖ సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్, కోస్ట్‌గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో నలుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూడిమడక బీచ్‌కు 15 మంది విద్యార్థులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
* అప్పులబాధతో రాష్ట్రంలో ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అమీన్సాహెబ్పాలెం గ్రామానికి చెందిన కొత్తలూరి లాలూ సాహెబ్ (40) నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గడిచిన రెండు సంవత్సరాలుగా మిర్చి పైరు సాగు చేసి నష్టాల పాలయ్యాడు. సుమారు రూ 5 లక్షలకు పైగా అప్పు అయింది. దిక్కుతోచని స్థితిలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన దాసం చక్రపాణి(52) తన ఎకరన్నర పొలంతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాడు. గతేడాది కూడా ఆరు ఎకరాల్లో మిరప, నాలుగు ఎకరాలలో పత్తి, కూరగాయల పంటలు సాగుచేశాడు. మిరప పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంటలు కూడా అదే పరిస్థితి. దాదాపుగా రూ.15లక్షలు అప్పులు మిగిలాయి. 20 రోజుల క్రితం ఇంటిని అమ్మి కొంత బాకీతీర్చాడు. అయినా పూర్తిగా అప్పులు తీరే దారి కనిపించలేదు. ఈ క్రమంలో మనోవేదనతో ఈ నెల 24న గడ్డిమందు తాగిన అతన్ని కుటుంబసభ్యులు చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి, తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శుక్రవారం ఒంగోలు రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన సామేలు తన ఐదు ఎకరాల పొలంతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సాగు ఖర్చుల కోసం సుమారు రూ.16 లక్షలు అప్పులుచేశాడు. దీనికితోడు వెలుగోడు కెనరా బ్యాంకులో మరో రెండున్నర లక్షలు క్రాప్లోన్ తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పంటలు సరిగా పండక.. అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సామేలు క్రిమి సంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
*పూడిమడక సముద్ర తీరంలో విషాదం నెలకొంది. అనకాపల్లి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు బీచ్కు వెళ్లారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతు కాగా పవన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. అస్వస్థతకు గురైన మరో విద్యార్థి తేజను ఆస్పత్రికి తరలించారు. గలంతైన ఐదుగురు విద్యార్థులు జగదీష్ (గోపాలపట్నం) జశ్వంత్ (నర్సీపట్నం) సతీష్ (గుంటూరు) గణేష్(చూచుకొండ) చందు(ఎలమంచిలి)ల ఆచూకీ కోసం మెరైన్, కోస్ట్గార్డ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మిగిలిన 8 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు.
*నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాదకర ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఇంకొల్లు మండలం సూదివారిపాలెం ఎస్టీ కాలనీకి చెందిన పాలపర్తి ప్రతాప్(7), పాలపర్తి శివరాజు (9) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లి వచ్చి..నిన్న సాయంత్రం ఆడుకునేందుకు నాగండ్ల రోడ్డు వైపుకు వెళ్లారు. అక్కడ ఉన్న నీటి కుంటను చూసి ఈత కొట్టడానికి చెప్పి మునిగిపోయారు. అటుగా వెళుతున్న వారు గమనించి ఇరువురిని బయటకు తీసి ఇడుపులపాడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారులు మృతి చెందటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి .ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
*సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మలయాళ యువ నటుడు శరత్ చంద్రన్(37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శరత్ కొచ్చిలోని తన నివాసం విగత జీవిగా కనిపించాడు. శరత్ హఠాన్మరణంతో ఒక్కసారిగా మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీంతో అతడి మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
* ఇంట్లో ఎలుకలను చంపేందుకు ఒక మహిళ టొమాటోలలో ఎలుకల మందు పెట్టింది. అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్ చేసుకున్న ఆమె పొరపాటున ఆ విషపు టొమాటోలను అందులో వాడింది. దీంతో ఆ సూడుల్స్ తిన్న ఆ మహిళ అస్వస్థతకు గురై మరణించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మలాడ్‌లోని పాస్కల్ వాడి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల రేఖా నిషాద్ ఈ నెల 21న ఇంట్లో ఇన్‌స్టంట్ నూడుల్స్ చేసింది.అయితే టీవీ చూస్తున్న ఆమె, వంటింట్లో ఎలుకలను చంపేందుకు ఎలుకల మందు కలిపి ఉంచిన టొమాటోలను పొరపాటున నూడుల్స్ తయారీలో వినియోగించింది. అనంతరం ఆ నూడుల్స్ తిన్న ఆ మహిళ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. వెంటనే స్పందించిన భర్త, మరిది వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆరు రోజులు చికిత్స పొందిన ఆ మహిళ బుధవారం మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.