Movies

అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా

అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా

ఒక తెలుగు చిత్రం షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లడం ఈ రోజుల్లో సర్వ సాదారణమైన విషయమే. అమెరికాలోనే కాదు ఇతర విదేశాల్లో ఇప్పుడు చాలా తెలుగు చిత్రాల షూటింగ్స్‌ జరుగుతున్నాయి. అయితే 45 ఏళ్ల క్రితం మాత్రం అమెరికాలో షూటింగ్‌ చేయడం నిజంగా ఓ సాహసమే. ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. అయినా సరే ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా మూడొంతులు చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించి శభాష్‌ అనిపించుకున్నారు నిర్మాత భరణీరెడ్డి, దర్శకుడు శ్రీధర్‌. ఆ చిత్రం పేరు హరే కృష్ణ.. హలో రాధ. హీరో కృష్ణ, శ్రీప్రియ జంటగా నటించారు ఇందులో.

ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉందిహీరో కృష్ణ, దర్శకుడు శ్రీధర్‌కు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఒకటుంది. అది ఏమిటంటే తేనె మనసులు కంటే ముందుగానే శ్రీధర్‌ నిర్మించే ఓ తమిళ చిత్రంతో కృష్ణ హీరో గా పరిచయం కావాల్సి ఉంది. అంతా కొత్త వాళ్లతో కాదలిక్క నేరమిల్లై చిత్రాన్ని నిర్మించాలని శ్రీఽధర్‌ అనుకున్నారు. అందుకే ఎర్రగా, బుర్రగా కనిపించే కృష్ణను హీరోగా ఎంపిక చేశారు. ఆయనకు తమిళం రాదు. అందుకే ఓ ట్యూటర్‌ను కూడా పెట్టారు. అయితే తెలుగు చిత్రాల్లో నటించాలి, పేరు తెచ్చుకోవాలి అనే కోరికతో ఉన్న కృష్ణకు తమిళం ఒక్క ముక్క కూడా బుర్రలోకి ఎక్కలేదు. వారం రోజులు గడిచినా కృష్ణకు తమిళం ఏమాత్రం రావడం లేదు అని తెలిసి ఇక లాభం లేదనుకుని హీరో వేషానికి తమిళుడైన రవిచంద్రన్‌ ఎంపిక చేశారు శ్రీధర్‌. నటనకు అతనూ కొత్తవాడే. అయినా తమిళుడు కావడంతో ఇబ్బందేమీ పడలేదు. తమిళంలో ‘కాదలిక్క నెరమిల్లై’ చిత్రం హిట్‌ అయింది. అదే చిత్రాన్ని దర్శకనిర్మాత పి.పుల్లయ్య ‘ప్రేమించిచూడు’గా తీశారు. ఇందులో అక్కినేని నటించడం గమనార్హం. అది జరిగిన 15 ఏళ్లకు హీరో కృష్ణ, దర్శకుడు శ్రీధర్‌ కాంబినేషన్‌లో ‘హరే కృష్ణ.. హలో రాధ’ చిత్రం రూపుదిద్దుకుంది. కథను బట్టి అమెరికాలో షూటింగ్‌ చేయడం కాకుండా, అమెరికాలో షూటింగ్‌ చేయాలనే అభిప్రాయంతో దర్శకుడు శ్రీధర్‌ ఈ చిత్ర కథను తయారు చేయడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో కృష్ణ, తమిళ వెర్షన్‌లో శివ చంద్రన్‌ హీరోలుగా నటించారు. శ్రీప్రియ, రతి రెండు భాషల్లోనూ నటించారు. తెలుగులో సత్యనారాయణ విలన్‌గా నటించారు.

విజయనిర్మల వంటఅమెరికాలో ఉన్నన్ని రోజులూ ఫుడ్‌ విషయంలో మాత్రం యూనిట్‌ ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇప్పుడైతే అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగు వారే ఉన్నారు కానీ 45 ఏళ్ల క్రితం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. ‘హరే కృష్ణ.. హలో రాధ’ చిత్రంలో తను నటించక పోయినప్పటికీ హీరో కృష్ణతోపాటు అమెరికా వెళ్లారు విజయనిర్మల. ఆవిడ వంటల స్పెషలిస్టు. అందుకే తను బస చేసిన చోటే వంటకు తగిన ఏర్పాటు చేసుకుని, ప్రతి రోజూ ఫుడ్‌ ఐటెమ్స్‌ను వండి, షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్లేవారు విజయనిర్మల. హీరో కృష్ణ షూటింగ్‌కు వెళ్లగానే మేక్‌పమన్‌ మాధవరావుని తీసుకుని సూపర్‌ మార్కెట్‌కు వెళ్లేవారు విజయనిర్మల. కూరలు, ఇతర దినుసులు కొనుక్కుని వచ్చి, స్వయంగా తనే వండి యూనిట్‌లో అందరికీ వడ్డించే వారు. యూనిట్‌ అంటే వందో రెండు వందల మందో లేరు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొద్ది మందితో మాత్రమే అమెరికా వెళ్లి షూటింగ్‌ చేశారు దర్శకనిర్మాతలు. క్రైమ్‌ ఎలిమెంట్‌ తో రూపుదిద్దుకున్న హరే కృష్ణ హలో రాధ చిత్రం 1980 అక్టోబర్‌ 16న విడుదలైంది.