NRI-NRT

దుబాయిలో గృహాలు కొంటున్న వారిలో భారతీయులే టాప్!

దుబాయిలో గృహాలు కొంటున్న వారిలో భారతీయులే టాప్!

దుబాయ్‌లో ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారిలో సంఖ్యాపరంగా మళ్లీ భారతీయులే నెం.1 గా నిలిచారు. దేశాల వారీగా చూస్తే.. భారతీయులే అధిక సంఖ్యలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నట్టు బెటర్ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. దుబాయ్‌లో ఈ ఏడాది ప్రథమార్థంలో ఆస్తుల కొనుగోలులో ప్రజల తీరుతెన్నులను సంస్థ తన సర్వేలో విశ్లేషించింది.

భారతీయుల తరవాత..వరుసగా బ్రిటన్, ఇటలీ సంతతి వారు నిలిచారు. ఈ జాబితాలో నాలుగో స్థానం రష్యన్లకు దక్కగా.. ఫ్రెంచ్ దేశస్తులు ఐదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా దేశస్తులు నాలుగో స్థానంలో నిలవడం సర్వేలోని మరో ఆసక్తికర అంశం. గతేడాది ఇదే సంస్థ జరిపిన సర్వేలో తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయిన రష్యన్లు..ఈసారి దుబాయ్‌లో విస్తృతంగా ఆస్తుల కొనుగోళ్లు చేపట్టడంతో ఏకంగా నాలుగోస్థానానికి ఎగబాకారు. గతేడాది జరిపిన సర్వేలోనూ భారతీయులే టాప్ పొజిషన్‌లో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో బ్రిటన్, ఇటలీ, చైనా, ఫ్రాన్స్ దేశాల వారు నిలిచారు.

అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే..2021లో బ్రిటన్ దేశస్తులు దుబాయ్ ఆస్తులపై పెట్టుబడులు కుమ్మరించారు. తక్కువ వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఆస్తుల విలువ వారిని దుబాయ్ వైపు మళ్లేలా చేశాయని అప్పట్లో నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపా దేశాల వారు దుబాయ్‌కు అధికంగా వలస వస్తున్నట్టు బెటర్ హోమ్స్ సంస్థ తెలిపింది. సొంత దేశాల్లో భారంగా మారిన పన్ను విధానాలు.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు పెరగడం కూడా ఇందుకు దోహద పడిందని వివరించింది. ఇక స్వదేశంలో ఆంక్షల కారణంగా చైనావాసులు అనేక మంది దుబాయ్ పెట్టుబడులను తగ్గించారని సంస్థ పేర్కొంది. ఫలితంగా వారు జాబితాలోని తొలి పది స్థానాల్లో చిట్టచివరన నిలిచారని చెప్పింది. ఈ సర్వే ప్రకారం..ఇళ్ల కొనుగోలు దారుల్లో పెట్టుబుడిదారుల వాటా 68 శాతంగా ఉంది. 32 శాతం మంది మాత్రం తాము నివాసం ఉండేందుకు ఇళ్లను కొనుగోలు చేశారు