బ్రిటన్ ప్రధాని రేసులో తాను వెనుకంజలో ఉన్నట్టు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు పన్నుల్లో కోత విధింలేది లేదన్న తన వాగ్దానం అందరినీ ఆకట్టుకోలేకపోయిందని సునాక్ తెలిపారు. అయితే చివరి వరకు విజయం కోసం ప్రయత్నిస్తానన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో జరిగిన తొలి సమావేశంలో రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధిక పన్నులతో జీవించడం తనకూ అంత తేలికేమీ కాదని, కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అదే సరైన విధానమని సునాక్ అన్నారు. పన్నుల్లో కోత విధించడం బాధ్యతాయుత చర్య కాదని, కన్జర్వేటివ్ విధానం కూడా కాదని ప్రధాని రేసులో తనకంటే ముందున్న లిజ్ ట్రస్‌ను ఉద్దేశించి సునాక్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు… లిజ్ ట్రస్‌కు మద్దతు పెరుగుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. తాను ప్రధాని పదవి చేపట్టాక దేశ పన్నుల విధానాన్ని పూర్తిగా సమీక్షిస్తానని ఆమె వాగ్దానం చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్ ధరలు తగ్గిస్తానని; సాధారణ కుటుంబాలకు పన్నులు న్యాయబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని ఆమె చెబుతున్నారు. కాగా… బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ కూడా లిజ్ ట్రస్‌కు మద్దతు పలికారు. సునాక్ మంత్రి పదవి నుంచి వైదొలగి బోరిస్ జాన్సన్ రాజీనామాకు కారణమయ్యారని, పన్నుల విషయంలో యూటర్న్ తీసుకున్నారని బెన్ వాలెస్ విమర్శించారు. బ్రిటన్ ప్రధాని అభ్యర్థిని సెప్టెంబరు 5న కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించనుంది.