Politics

TNI – నేటి రాజకీయ వార్తలు

TNI – నేటి  రాజకీయ వార్తలు

* వరద నష్టంపై కేంద్రానికి జగన్‌ పంపిన వివరాలు తప్పుల తడక
వరద నష్టంపై కేంద్రానికి సీఎం జగన్‌ పంపిన వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని టీడీపీ నేత పట్టాభి తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 గృహాలు మాత్రమే ధ్వంసమయ్యాయని, కేంద్రానికి నివేదిక పంపడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. 15వేల గృహాలు ధ్వంసమైనట్లు తెలంగాణకు ఎన్డీఎంఏకు నివేదిక పంపిందని తెలిపారు. ఏపీలో కేవలం 26వేల ఎకరాల పంట నష్టం జరిగిందని రిపోర్ట్ పంపారని, వాస్తవంగా 60వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని పట్టాభి పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలోని నదీ పరీవాహక లంక గ్రామాలు వరద వల్ల తీవ్రంగా నష్టపోయాయి. ఆ గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేకమంది జ్వరాలు, జలుబుతో బాధపడుతున్నారు.

*ఇది ఊహించ‌ని అభివృద్ధి : మంత్రి నిరంజ‌న్ రెడ్డి
తెలంగాణ ఉద్య‌మ అధినేత కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక రాష్ట్రంలో ఊహించ‌ని అభివృద్ధి జ‌రిగింద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నూత‌నంగా నిర్మించిన వ‌న‌ప‌ర్తి క‌లెక్ట‌రేట్‌, మెడిక‌ల్ కాలేజీ, ఎస్పీ కార్యాల‌యాల‌ను సింగిరెడ్డి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌హ‌కారంతో ఉచిత శిక్ష‌ణ పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థులు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడారు.

* మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రించారు : ఉద్ధ‌వ్ ఠాక్రే
మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే మండిప‌డ్డారు. మ‌రాఠీల‌ను అవ‌మానిస్తూ గ‌వ‌ర్న‌ర్ హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌వ‌ర్న‌ర్ ప‌దవిలో ఉన్న వారిని తాను అవమానించాల‌ని కోరుకోవ‌డం లేద‌ని..ఆ ప‌ద‌వికి తాను గౌర‌వ‌మిస్తాన‌ని అయితే భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ మ‌రాఠీల‌ను అవ‌మానించ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం పెల్లుబుకుతోంద‌ని ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ చేర‌వేస్తార‌ని, అలాంటి గ‌వ‌ర్న‌ర్ త‌ప్పు చేస్తే ఆయ‌న‌పై ఎవ‌రు చ‌ర్య తీసుకోవాల‌ని ప్ర‌శ్నించారు.కోశ్యారీ మ‌రాఠీల‌ను వారి ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీశార‌ని అన్నారు. గ‌త రెండున్న‌ర ఏండ్లుగా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా కోశ్యారీ రాష్ట్రంలో అన్నీ అనుభ‌వించార‌ని, మ‌హారాష్ట్ర వంట‌కాల‌ను ఆర‌గించార‌ని, అలాంటి వ్య‌క్తి ఇప్పుడు కొల్హాపురి చెప్పును చూడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, గుజ‌రాతీలు, రాజ‌స్ధానీల‌ను వెళ్ల‌గొడితే ముంబై, థానేల‌కు డ‌బ్బు దొర‌క‌ద‌ని కోశ్యారీ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఆర్ధిక రాజ‌దానిగా వెలుగొందిన ముంబై ఆ ఖ్యాతిని కోల్పోతుంద‌ని వ్యాఖ్యానించారు. కోశ్యారి వ్యాఖ్య‌ల‌పై సేన నేత‌లు భ‌గ్గుమ‌న్నారు.

* వరద బాధితులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు స్వచ్ఛంద సంస్థలు సహాయం అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇంకా అనేక గ్రామాలు బురదలో కొట్టుమిట్టాడుతున్నాయని, నిత్యావసరాలు లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని అన్నారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వారిని ఆదుకోవాలని సూచించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో ఆహార పదార్థాలు , వస్తువులు అందజేశామని వెల్లడించారు. దాతలు వారి పేరుతోగానీ, టీడీపీ ద్వారా గానీ సాయం చేయాలని ఆయన కోరారు

* మద్యపాన నిషేధం వైసీపీ మ్యానిఫెస్టోలో లేదు : ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎక్కడా చెప్పలేదని, అది తమ మ్యానిఫెస్టోలో లేనే లేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. దశలవారీగా మద్యం నియంత్రణ చేస్తామని మద్యం ధరను ఫైవ్‌స్టార్‌ హోటల్‌ రేట్లకు తీసుకెళ్తామని ప్రకటించామని ఆయన ఇవాళ మీడియా సమావేశంలో వెల్లడించారు. మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉన్న బార్లను, వైన్స్‌ల సంఖ్యను తగ్గించామని తెలిపారు.

*బటన్లు నొక్కితే అభివృద్ధి అవుతుందా?: సాకే శైలజానాధ్
ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్సీ ఎం జగన్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీఎం కార్యాలయానికి పరిమితమై అక్కడి నుంచే బటన్ నొక్కుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. డీబీటీ పేరుతో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లా? అని ప్రశ్నించారు. అమరావతిని ముందు అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

*మీటర్ల బిగింపు ప్రక్రియకు మేం వ్యతిరేకం: సోమిరెడ్డి
వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తాము వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు కట్టేందుకు, ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే మోటార్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేసే కుట్ర జరుగుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్లను పెట్టాల్సిందేనని సీఎం అనడం అన్యాయమన్నారు. రైతుల పంపుసెట్లకు మోటర్లు బిగించడం అన్యాయమని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణను బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తోన్నా.. మన రాష్ట్రంలో వీటి అమలుకు సీఎం జగన్ పూనుకోవడం బాధాకరమన్నారు. దీనివల్ల రైతులపై భవిష్యత్తులో విద్యుత్ భారం తప్పదని పేర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

*బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమే: సోమువీర్రాజు
బీజేపీ (BJP) ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు , మాజీప్రధాని వాజ్‌పేయితో ఉన్నట్లుగా.. ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాజధాని పూర్తయ్యేదని తెలిపారు. మోదీతో చంద్రబాబు ఉంటే వైసీపీకి 150 సీట్లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే రెండేళ్లలో రాజధాని నిర్మిస్తామని ప్రకటించారు. సీఎం జగన్ , చంద్రబాబు తీరుతో రాజధాని రైతులు నష్టపోయారని సోమువీర్రాజు దుయ్యబట్టారు. అంతకుముందు రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజు పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని వీర్రాజు చెప్పారు. దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌, మీరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని రైతు శాపనార్థాలు పెట్టారు. సోమువీర్రాజుతో కోటేశ్వరరావు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ‘‘రాజధానిని కట్టని ఆయనను వదిలి మామీద పడితే ఎలా’’ అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో సోమువీర్రాజు ఖంగుతిన్నారు.

* కేటీఆర్‌ కోసం సీనియర్లను కేసీఆర్‌ తొక్కేస్తుండు.. టీఆర్‌ఎస్‌కు రాజయ్య గుడ్‌బై
తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్‌ ఇచ్చారు సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజయ్య యాదవ్‌.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన టీఆర్‌ఎస్‌ పరిస్థితులపై, సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమ టైంలో కేసీఆర్ వెంట నడిచిన రాజయ్య యాదవ్.. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకంగా వ్యహరించారు. కేసీఆర్‌తో పాటు ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురు సీనియర్ నేతలతో రాజయ్య యాదవ్ ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టై ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు జైల్లోనూ గడిపారు రాజయ్య యాదవ్. గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పని చేశారు కూడా. ఇవాళ పార్టీకి రాజీనామా ప్రకటించిన సందర్భంలో ఇవాళ ఆయన హాట్‌ కామెంట్లు చేశారు.

*చీకోటితో ఎలాంటి సంబంధాలు లేవు: బాలినేని
హైదరాబాద్కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఒంగోలులో శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తనకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదని, పేకాట ఆడుతుంటానని చెప్పారు. ఎప్పుడైనా ఒకసారి క్యాసినోకి వెళ్తుంటానని.. అంతేతప్ప ఈ ప్రవీణ్ వంటి వారితో ఎటువంటి సంబంధాలు లేవని తెలిపారు. ఏది జరిగినా లేనిపోనివి అంటగట్టి బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

*వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రావు: ప్రజాశాంతి పాల్
సీఎం వైఎస్ జగన్కు తనను కలిసి మాట్లాడే ధైర్యం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. విజయవాడలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటూ రాదని, ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాపులు, దళితుల ఓట్లతో అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారని, కానీ ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లను ఎవరూ కొనలేరన్న విషయాన్ని సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు. త్వరలో పాల్ రావాలి… పాలన మారాలి అన్న నినాదంతో యాత్రను చేపడుతున్నానని, పాల్గొనే వారు 7998055552 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్, ఏపీలో జనసేన, టీడీపీ అన్నీ బీజేపీ తానులోని ముక్కలేనని విమర్శించారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలు తనతో కలిసి నడిస్తే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాకినాడలో తన వాహనాలను సీజ్ చేశారని అబద్ధం ప్రచారం చేశారని పాల్ ఖండించారు. అంత ధైరం ఎవరికీ లేదన్న పాల్.. తన కార్లను తీసుకెళ్లిన వారిని దేవుడే శిక్షిస్తాడని శపించడం గమనార్హం.

*పోలవరానికి రెండేళ్లలో కేంద్రం నుంచి నిధులు తెస్తాం: సజ్జల
పోలవరం ప్రాజెక్టుకు రెండేళ్లలో కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేటైనా 41.5మీటర్ల వరకు ఆర్ అండ్ ఆర్ తానే ఇస్తానని సీఎం జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికతో ప్రకటన చేశారని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తేనో, ఆర్అండ్ఆర్ ఇవ్వకుండా నీళ్లు నింపితేనో గగ్గోలు పెట్టాలి గానీ.. దీనిని రాజకీయం చేయడం సరికాదన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా టీడీపీకి ఓటమి తప్పదని ఆ పార్టీ నేతలకు తెలుసని, అందుకే రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారమిక్కడ రెడ్డి హాస్టల్ నూతన గ్రంథాలయ భవన్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో 45.5 మీటర్ల వరకు పూర్తిగా నీరు నింపాలంటే మరో రెండేళ్లు పడుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామాలు చేయలేదన్నారు. ఆయన చరిత్రహీనుడని, ప్రజలు చెత్త బుట్టలో పడేశారన్నారు. సినీ నిర్మాత అశ్వినీదత్ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్త మాటల్లా ఉన్నాయని.. తిరుమల పవిత్రతకు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.

*తెలంగాణ పాలిట శనిలా మోదీ సర్కారు!
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు శనిలా దాపురించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంట్లో చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే విభజన హామీలన్నింటినీ పక్కన పెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో ఐటీని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 2008లో కేంద్రంలోని అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసిందని, 013లో దానికి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్తోపాటు ఎన్నో ప్రాజెక్టులను మూలకు పెట్టిందని విమర్శించారు. పైగా ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంటులో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.