Business

అంబానీదే 5జీ స్పెక్ట్రం

Jio Captures 5G Spectrum Bid

రెండ్రోజుల్లోనే ముగుస్తుందనుకున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలం (5G auction) ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. జులై 26న ప్రారంభమైన వేలం ప్రక్రియ.. సరిగ్గా వారం రోజుల పాటు జరిగింది. చివరి రోజు నాలుగు రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 1.50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది విక్రయించిన 4జీ వేలం కంటే (రూ.77,815 కోట్లు) దాదాపు రెట్టింపు కాగా.. 2010లో నిర్వహించిన 3జీ వేలంతో (రూ.50,958 కోట్లు) పోలిస్తే ఈ మొత్తం మూడు రెట్లు అధికం. ఈ వేలం ప్రక్రియలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. మరో టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌ కోసం వేలంలో పాల్గొన్న అదానీ గ్రూప్‌ 26 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. జియో, ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా సేవలందించేందుకు స్పెక్ట్రమ్‌ దక్కించుకోగా.. వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఎంపిక చేసిన సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిందో వేలం డేటా మొత్తం సేకరించాక వెల్లడి కానుంది.