75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పర్యాటకులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ. భారత్‌ను అమృత కాలంలోకి తీసుకెళ్లేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉపయోగపడుతుందని పేర్కొంది. చరిత్రను స్మరించుకుంటూ సంస్కృతి, వారసత్వాన్ని గుర్తు చేస్తూ బంగారు భవిష్యత్తుకు మార్గం వేసేందుకు సాయపడుతుందని పేర్కొంది. 2021, మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఫ్రీడమ్ మార్చ్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృతి మహోత్సవంలోని కార్యక్రమాల వివరాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం 2023, ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం మహాత్మాగాంధీ సహా.. స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు.