అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్‌ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యములో ఇప్పటివరకు 150 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాదాపు ఒక సంవత్సరం పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు 33 దేశాల తెలుగు స్మస్థల నాయకులు, తెలుగేతర ప్రముఖులు కూడా పాల్గొన్నారని తెలిపారు. గత 6 నెలలుగా రత్నకుమార్ (సింగపూర్), ఘంటసాల కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందని తెలియచేశారు.
ఇందులో భాగంగా యూఎస్‌ఏ నుంచి ప్రముఖ గాయకుడు, రచయిత ఫణి డొక్క వ్యాఖ్యాతగా 24 జులై 2022 నాడు జరిగిన ఆన్‌లైన్ జూమ్(Zoom) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అమరగాయకుడు, సంగీత దర్శకుడు, పదివేలకు పైగా పాటలు పాడి భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం గర్వించతగునటువంటి మహాగాయకుడని కొనియాడారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎందరో కళాకారులు ఆకాంక్షతో తాను కూడా ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని తెలిపారు.
మరొక విశిష్ట అతిథి ప్రముఖ గాయకుడు, నటుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘంటసాల గురించి మాట్లాడే అర్హత గాని, ఆయన గాన వైభవాన్ని గురించి చర్చించే అంత శక్తి గాని తనకు లేదని చెప్పారు. అయితే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గాయకుడికిగా ఆయనను సంగీత విద్వాంసుడాగానే కాకుండా, స్వాతంత్ర సమరయోధుడిగా కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన గాంధర్వ గానం ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనుసరించడంతో పాటు అనుకరిస్తున్నారని అన్నారు.
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నంది, మా మ్యూజిక్ అవార్డు గ్రహీత (చెన్నై, ఇండియా) గోపిక పూర్ణిమ మాట్లాడుతూ, మహాగాయకులు, సంగీత దర్శకులు ఘంటసాలకు భారతరత్న పురస్కారంతో సత్కరించాలని ఒక ఆశయం కోసం కృషిచేస్తున్న దాదాపు 33 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
యూఎస్‌ఏ నుంచి శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఆనంద్ దాసరి (డల్లాస్), రవి రెడ్డి మరకా (నెవార్క్), టీఏఎస్‌సీ అధ్యక్షుడు రావు కల్వకోట (లాస్ ఏంజిల్స్), అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ రవి, శశికళ పెనుమర్తి (అట్లాంటా), తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని అభిప్రాయపడుతూ ఆయనకి భారతరత్న అవార్డుతో సత్కరించాల్సిందే ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారం భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జెర్మనీ, నెథర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 150 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ లింక్‌ని నొక్కి సంతకాల సేకరణకు మీ మద్దతు తెలియ చేయండి: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ చిరునామాకి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు.