Devotional

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ –TNI ఆధ్యాత్మిక వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ –TNI ఆధ్యాత్మిక వార్తలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు తెలిపారు. అనంతరం 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ తర్వాత తొలిసారి శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని తిరుచానూరులో శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు 550 టికెట్లు మంజూరు చేశామని, మరో వెయ్యికి పైగా టికెట్లను భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని వర్చువల్ విధానంలో పాల్గొన్నారని తెలిపారు.భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో రెండు, పుష్కరిణి వద్ద ఒకటి, గంగుండ్ర మండపం వద్ద ఒకటి కలిపి నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

1. ఇంద్రకీలాద్రిలో శ్రావణమాసం వేడుకలు
ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులు లక్ష కుంకుమార్చనలు, ఖడ్గమాల చేయించుకున్నారు. అలాగే విశాఖలోని అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత శోభ సంతరించుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
tiruchanur2
2. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 72,067 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 27,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

3. భద్రాద్రి రామాలయంలో సహస్రనామ కుంకుమార్చన పూజలు
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా: శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమం జరగనుంది. శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రతం కనులపండువగా జరుగుతోంది. రామాలయంలో స్వర్ణాలంకృతులైన మూలమూర్తులకు అర్చకులు సుప్రభాతం నిర్వహించి నామార్చనలు చేసి ఆరాధించారు. భక్తులు అమ్మవారికి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

4. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు సాదరంగా ఆహ్వానం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అల్లోల‌కు… వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. అందరినీ చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నానని మంత్రి తెలిపారు.

5. యాదాద్రీశుడిని దర్శించుకున్న AP మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా శతఘటాభిషేకంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అర్చకులు మంత్రి రోజాకు వేదాశీర్వచనం అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణమాసంలో స్వాతి నక్షత్రం రోజు స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.ప్రజలకు సేవచేయడానికి యాదాద్రీశుడు నాకు మరింత ధైర్యం, రెట్టింపు ఉత్సాహం ఇస్తాడని చెప్పారు. గతంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాతే మంత్రి అయ్యానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని, అది కేసీఆర్ పూర్వ జన్మసుకృతమన్నారు. భగవంతుడు తనకు నచ్చిన వారితో ఆలయ నిర్మాణం చేస్తాడని.. సీఎం కేసీఆర్‌కు ఆ భాగ్యం దక్కిందని వెల్లడించారు.

6. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొడుకు పుట్టాక ఆయన భార్య తేజస్వినితో కలిసి తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబ‌ర్ 10, 2020న అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దిల్‌రాజు, తేజస్వినిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే.రీసెంట్‌గానే దిల్‌రాజు మరోసారి తండ్రి అయ్యారు. దీంతో కొడుకుతో సహా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.కాగా ఈ సందర్భంగా సినిమా షూటింగ్స్‌ నిలిపివేయడంపై సుమన్‌ మాట్లాడిన తీరుపై రిపోర్టర్స్‌ స్పందించగా సినిమాకు సంబంధించిన విషయాలు అక్కడ ప్రస్తావించనన్నారు.దేవుడి సన్నిధిలో వాటి గురించి చర్చించనంటూ పేర్కొన్నారు. కాగా ఆగస్ట్‌ 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ నిలిపివేయాలని ప్రొడ్యుసర్స్‌ గిల్డ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోయాయి.