హైదరాబాద్ బిర్యానీ, బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు ఇలా చెప్పుకుంటే పోతే తెలుగు రాష్ట్రాల్లో అనేక వంటకాలు అద్భుత రుచికి పెట్టింది పేరు. ఇక నెల్లూరు అనగానే ఆహార ప్రియులకు చేపల పులుసు గుర్తుకొస్తుంది. ఈ జాబితాలో స్వీట్స్ ఇష్టపడేవారికి మాత్రం జైహింద్ మలైకాజానే మదిలో మెదులుతుంది. ప్రతిఒక్కరితో ఆహా ఏమి రుచి అనిపిస్తుంది.
మలైకాజా… నెల్లూరు వాసులకు 7 దశాబ్దాలుగా అత్యంత ఇష్టమైన మిఠాయిగా ప్రసిద్ధికెక్కింది. స్వీట్స్ అంటే ఇష్టంలేని వారు సైతం లొట్టలేసుకుంటూ తినే రుచి మలైకాజా సొంతం అంటే నమ్మాల్సిందే! తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాలకూ ఎగుమతి అవుతున్న ఈ మలైకాజాకు చిరునామాగా నిలుస్తోంది నెల్లూరులోని జైహింద్ స్వీట్స్. ఎప్పుడో స్వాతంత్య్ర పోరాట సమయంలో పురుడుపోసుకున్న ఈ మిఠాయికి.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన కమాల్ సింగ్ కుటుంబం.. 1945లో ఉపాధి వెతుక్కుంటూ నెల్లూరు వచ్చి స్థిరపడింది. స్వాతంత్రోద్యమ కాంక్ష తీవ్రంగా ఉన్న ఈ సమయంలో.. మిఠాయి వ్యాపారం ప్రారంభించిన కమాల్‌సింగ్… తన దుకాణానికి జైహింద్ అని పేరు పెట్టుకున్నారు. దమ్ రోటీహల్వా, బొంబాయి హల్వా, బాదుషా వంటి మిఠాయిలు విక్రయించేవారు. అయితే.. వాటన్నింటి కంటే మలైకాజా బాగా ప్రాచుర్యం పొందింది.ఈ మలైకాజా రుచికి సామాన్యులే కాదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఫిదా అయ్యారు. నెల్లూరు వస్తే.. తప్పక ఈ కాజాను రుచిచూడాల్సిందే. ఈ మిఠాయి తెలుగువారి ప్రశంసలే కాదు.. ఇతర రాష్ట్రాలు, విదేశీయుల ఆదరణనూ పొందింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో.. ఈ జైహింద్ స్వీట్స్ షాప్ చర్చలోకి వచ్చింది. మరి, మీరెప్పుడైనా నెల్లూరు వెళ్తే.. ఈ కాజాను టేస్ట్ చేయడం మాత్రం మరిచిపోకండి..