సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్‌గా చలామణి అవుతుంటారని, అంత మాత్రాన వారిని పబ్లిక్ ప్రాపర్టీగా భావించకూడదని హెచ్చరించింది అగ్ర కథానాయిక తాప్సీ. ప్రస్తుతం ఈ భామ తన తాజా చిత్రం ‘దొబారా’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఇటీవల ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన తాప్సీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ ఫొటోగ్రాఫర్ ఆమెతో అమర్యాదగా ప్రవర్తించాడట. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ ‘కారు దిగగానే ఓ ఫొటోగ్రాఫర్ ఫొటోలంటూ వెంటపడ్డాడు. అక్కడ ఫొటోషూట్ ఉంటుందని ఆర్గనైజర్స్ ముందుగా నాతో చెప్పలేదు కాబట్టి వొద్దని వారించాను. దాంతో ఆ ఫొటోగ్రాఫర్ నన్ను దుర్భాషలాడారు. అమర్యాదగా ప్రవర్తించాడు. అతని వృత్తిపై ఉన్న గౌరవంతో ఒక్కమాట మాట్లాడకుండా వెళ్లిపోయాను. ఈ సంఘటన నన్ను ఎంతగానో బాధించింది. సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. పబ్లిక్‌లోకి వస్తే వారిని అకారణంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నటిగా సుదీర్ఘ కెరీర్లో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది. సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీలు కాదు. వారి స్వేచ్ఛను గౌరవించాలి’ అని తాప్సీ పేర్కొంది.