వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరులో తనకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లందరి బండారం తన వద్ద ఉందన్నారునెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సొంత పార్టీ నాయకులపైనే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన విమర్శలు అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. నెల్లూరు నగరంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ యాదవ్ ఓ వర్గం నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక నాయకుడు వైసీపీలో ఉండి ఒక నాయకుడు సిగ్గుమాలిన పనులు చేస్తున్నాడని మాజీ మంత్రి అనిల్ యాదవ్ మండిపడ్డారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లు తెలుగు దేశం పార్టీ నాయకులతో నిత్యం మంతనాలు జరుపుతున్నారని చెప్పారు.
వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న వాళ్లందరి ఫోన్‌కాల్ హిస్టరీ మొత్తం తన వద్ద ఉందని అనిల్ యాదవ్ బాంబు పేల్చారు. త్వరలోనే వాళ్లందరి బండారం బయటపెడతానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ల దగ్గర నుంచి ఎంతెంత డబ్బు వెళ్తుందో అన్నీ తనకు తెలుసని వెల్లడించారు. అయితే, తన వ్యతిరేకుల పేర్లు బయటకు చెప్పకుండా మాజీ మంత్రి అనిల్ యాదవ్ చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరులో తనను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు.