చిత్రసీమతో గాసిప్పులు కూడా సహవాసం చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో వాటికి మరింత బలం వస్తుంది. రష్మిక చుట్టూ కూడా అలాంటి వార్తలే షికారు చేస్తుంటాయి. విజయ్ దేవరకొండతో తాను ప్రేమలో పడిందని కొంతకాలంగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ‘డియర్ కామ్రేడ్’లో ఇద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వాళ్ల మధ్య ప్రేమ పుట్టిందని ఓ టాక్ నడుస్తోంది. ‘డియర్ కామ్రేడ్’ తరవాత కూడా చాలా సందర్భాల్లో విజయ్ – రష్మిక కలిసి కనిపించారు. దాంతో ఆ వార్తలకు బలం వచ్చినట్టైంది. రష్మికతో తనకున్నది స్నేహం మాత్రమే అని ఆమధ్య… విజయ్ క్లారిటీ ఇచ్చాడు.ఇప్పుడు రష్మిక వంతు వచ్చింది. ‘‘మేమిద్దరం స్నేహితులం మాత్రమే. ఈ విషయం చాలాసార్లు చెప్పా. అయినా పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. నేను ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి గురించి ఏం అడిగినా సమాధానం చెబుతా. ఏం చెప్పలేని ప్రశ్నతో.. నన్ను విసిగించొద్దు. ప్రేమ – పెళ్లి అనేవి చాలా పెద్ద విషయాలు. నిజంగా ప్రేమలో పడితే ఆ విషయం తప్పకుండా చెబుతా’’ అంటూ ఈ గాసిప్పులకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది రష్మిక. ఇప్పటికైనా ఈ వార్తలకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.