DailyDose

మరింతగా మద్యం సేవించండి… ఆ దేశ యువతను కోరిన జపాన్‌, ఎందుకంటే?

మరింతగా మద్యం సేవించండి… ఆ దేశ యువతను కోరిన జపాన్‌, ఎందుకంటే?

మరింతగా మద్యం సేవించాలని దేశ యువతను జపాన్‌ కోరింది. అలాగే మద్యపానంతోపాటు అమ్మకాలను పెంచేందుకు కొత్తగా ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. లిక్కర్‌ బిజినెస్‌ అభివృద్ధి కోసం యువత నుంచి వినూత్న ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులను కూడా ఆహ్వానించింది. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న మద్యం వ్యాపారాన్ని గాడిలో పెట్టడంతోపాటు దాని ద్వారా కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు ఈ మేరకు ప్రచారం చేపట్టింది. కరోనా కాలంలో జపాన్‌లో మద్యపానం గణనీయంగా తగ్గింది. 1995లో జపాన్‌ ప్రజలు వంద లీటర్ల వరకు మద్యాన్ని సేవించేవారు. కరోనా వల్ల జపాన్‌ ప్రజలు ఖర్చులు తగ్గించుకోవడంతో ప్రస్తుతం ఇది 75 లీటర్లకు పడిపోయింది. తద్వారా ఆ దేశ ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది.

ఈ నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడంపై జపాన్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. మరింతగా మద్యం సేవించాలని దేశ యువతను కోరింది. అలాగే ‘సేక్‌ వివా’ పేరుతో జాతీయ స్థాయిలో వ్యాపార పోటీని నేషనల్ ట్యాక్స్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. యువ జనాభాలో మద్యపానాన్ని ప్రోత్సహించడంతోపాటు సేక్, షోచు, అవమోరి, బీర్, విస్కీ, వైన్‌లతో సహా జపనీస్ ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు డిమాండ్‌ను పెంచడంలో సహాయపడే వ్యాపార ఆలోచనలతో ముందుకు రావాలని యువతను కోరింది.

అలాగే జపాన్‌ మద్యం బ్రాండ్ల విలువను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు, మెటావర్స్, భౌగోళిక సూచికలు వంటి కొత్త విక్రయ పద్ధతులను సూచించాలని ఆ దేశ ప్రజలను జపాన్ పన్ను ఏజెన్సీ కోరింది. ఈ పోటీకి ఎలాంటి ప్రవేశ రుసుం లేదని తెలిపింది. తొలి దశ విజేతలను సెప్టెంబర్‌ 27న ఎంపిక చేస్తారు. అనంతరం అక్టోబర్‌లో మరో దశ పోటీ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్‌ 10న రాజధాని టోక్యోలో ప్రత్యేక ప్రాజెక్టులకు సంబంధించిన విజేతలను ప్రకటిస్తారు.

కాగా, కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న దేశీయ మద్యం పరిశ్రమల పునరుద్ధరణ, దేశ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ పోటీ దోహదపడుతుందని జపాన్ పన్ను ఏజెన్సీ పేర్కొంది.