చేతిలో పాకెట్ మనీ ఉంటే దాన్ని ఎలా ఖతం చేయాలి? దోస్తులతో కలిసి బయటకు వెళ్తే గ్రాండ్ పార్టీ చేసుకోవాలి! ఆన్‌లైన్ గేమ్ ఆడితే గెలవాలంతే.. దానికి పైసలు ఖర్చయినా పర్లేదు! ఇదీ ఇప్పటి పిల్లల ఆలోచన. ముఖ్యంగా హైస్కూల్ పిల్లల్లో ఈ తరహా ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయని సర్వేలు చెప్తున్నాయి. తాజాగా మువిన్ అండ్ మామ్స్‌ప్రెస్సో చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ‘దేశంలో యువతకు ఆర్థిక అవగాహన’పై 2010 నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులను సర్వే చేసింది. పిల్లల మనీ మేనేజ్‌మెంట్, ఆర్థిక విద్య తదితర అంశాలపై అభిప్రాయాలు సేకరించింది. అందులో.. 7వ తరగతి-12వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులు దుబారా ఖర్చు చేస్తున్నట్టు తేలింది. వారిలో అసలు ఆర్థిక అవగాహన లేదని వెల్లడైంది. కనీసం తల్లిదండ్రులూ దేనికి డబ్బు ఖర్చు చేయాలి.. దేనికి చేయొద్దు అన్న విషయాలు పిల్లలకు చెప్పటం లేదట.
దేశంలోని 96 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆర్థిక అవగాహన లేదని అంగీకరించారు. ఒకప్పుడు డబ్బులు కావాలంటే తల్లిదండ్రులను అడిగి తీసుకునేవారని, తద్వారా పిల్లలపై ప్రతిసారి నిఘా ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరగడం, ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌లు పిల్లలకు తెలియటంతో చాలామంది ఆన్‌లైన్ చెల్లింపులు చేసేస్తున్నారని తెలిపారు. 70 శాతం మంది బ్లాక్ చైన్, నాన్ ఫంగబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టీ), క్రిప్టో కరెన్సీ వంటి వాటి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటివి తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పిల్లలకు ఆర్థిక అవగాహన కల్పించటంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర అని నిపుణులు తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్పించాలని, తద్వారా భవిష్యత్తులో ఆర్థిక వైఫల్యాలు తకువగా ఉంటాయని వెల్లడించారు. అవసరం, కోరిక మధ్య వ్యత్యాసాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు వివరించాలని, ఆస్తిని సమర్థంగా వినియోగించుకొనే మెళకువలు నేర్పాలని సూచించారు. పొదుపు, బడ్జెట్, ఇతర ఆర్థిక అంశాల గురించి పిల్లలతో తరచూ మాట్లాడాలని చెప్పారు. లేకపోతే పిల్లలు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.