Agriculture

₹551కోట్లతో వాటర్‌షెడ్ల నిర్మాణం. 6లక్షల ఎకరాలకు నీరు.

₹551కోట్లతో వాటర్‌షెడ్ల నిర్మాణం. 6లక్షల ఎకరాలకు నీరు.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు వర్షాధారంపై మాత్రమే ఆధారపడుతూ వ్యవసాయం చేసుకునే భూములు లేదా ఏ వనరులు లేక బీడుగా ఉండిపోయిన ఆరు లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌ షెడ్‌ల నిర్మాణం ద్వారా కొత్తగా సాగులోకి తీసుకురాబోతోంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 59 మండలాల పరిధిలో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అక్కడే నిల్వ ఉంచేలా రూ.555.31 కోట్లతో వాటర్‌షెడ్‌ల నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది.

ఈ ఖర్చును 60–40 నిష్పతిలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే మొత్తం 310 గ్రామ పంచాయతీల పరిధిలోని దాదాపు ఐదు లక్షల రైతు కుటుంబాలకు సంబంధించిన 6,03,938 ఎకరాలకు (2,44,405 హెక్టార్లు) సాగునీటి వసతి మెరుగుపడుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి అధికారులు వెల్లడించారు. అంతేకాక.. ఆయా గ్రామాల్లో మరో రెండు లక్షల దాకా రైతు కూలీ కుటుంబాలకు ఆదాయ మార్గాలు పెరిగేలా వివిధ రకాల జీవనోపాధుల కల్పనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించనుంది. వాటర్‌షెడ్‌ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వినూత్న ఫలితాల సాధనే ధ్యేయంగా చేపట్టబోతోంది. వాటి నిర్మాణ సమయంలోనే ఆయా గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం మేరకు బీడు, బంజరు భూములకు సాగునీరు వసతి మెరుగుపడుతుందా లేదా అన్నది పరిశీలన, సమీక్షలు చేసుకుంటూ రెండు నుంచి ఐదేళ్ల మధ్య కాలంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నది అంచనా వేశారు. అలాగే, సమగ్ర ప్రణాళిక (డీపీఆర్‌)లు కూడా అధికారులు సిద్ధంచేశారు.

ఇక కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమంపై రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే భూ వనరుల (ల్యాండ్‌ రిసోర్స్‌) విభాగం అదనపు కార్యదర్శి హుకుంసింగ్‌ మీనా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సోమవారం తొలత సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతోనూ ఆయన భేటీ అవుతారు.