* పిల్లల్ని అలర్జీలు, క్రిమికీటకాల నుంచి రక్షించాలన్న ఉద్దేశంతో రోజూ ఫ్లోర్ క్లీనర్లతో శుభ్రం చేస్తున్నారా? దోమల నుంచి కాపాడటానికి స్ప్రేలు, రెపలెంట్‌లూ వాడుతుండుంటారు. కానీ వాటితో బుజ్జాయిలకి హానే ఎక్కువని తెలుసా! బ్యాక్టీరియాతో పోరాడటానికి, ఉత్పత్తులు నిల్వ ఉండటానికి వీటిల్లో క్లోరిన్, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు వాడతారు. ఇవి పిల్లల్లో దద్దుర్లు, కళ్లు ఎరుపెక్కడం, ఊపిరిలో ఇబ్బంది, రోగనిరోధకత తగ్గడం నుంచి నరాల బలహీనత, క్యాన్సర్ వరకూ దారి తీయొచ్చు. కాబట్టి.. సహజ పద్ధతుల్లో తయారైన క్లీనర్లు వాడాలి. దోమల విషయంలోనూ స్టికీ ట్రాప్స్ లేదా రసాయన రహిత పద్ధతులను ఎంచుకోండి.
* పసిపిల్లల దుస్తులు శుభ్రం చేయడానికి చాలామంది బ్లీచ్ వాడుతుంటారు. దీనివల్ల దురద, కళ్లు మసకబారడం, గొంతు మంట, శ్వాస సమస్యలు వంటివి వస్తాయి. బదులుగా… హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వాడండి. పిల్లలకీ సురక్షితం, బ్యాక్టీరియా, వైరస్‌ల బెడదా ఉండదు.
* ఫర్నిచర్‌కు త్వరగా నిప్పు అంటుకోకూడదని పీబీడీఏఎస్‌గా పిలిచే ఫ్లేమ్ రిటార్డెన్స్‌ను కోటింగ్‌గా వాడతారు. కారు సీట్లు సోఫాలు, కుషన్లు, కార్పెట్లు మొదలైన వస్తువుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. హార్మోన్లలో అసమతుల్యత, మానసిక ఎదుగుదల లోపాలు, త్వరగా యవ్వనంలోకి అడుగుపెట్టడం, హైపర్ ఆక్టివిటీ వంటి లక్షణాలు దీని చలవే. కొనేముందే ఇలాంటివేమైనా వాడారేమో చెక్ చేసుకోవాలి.
* సబ్బు, షాంపూ.. నురగొస్తే కానీ శుభ్రపడిన భావన కలుగదు కదా! కానీ నురగ రావడం కోసం ఎస్‌ఎల్‌ఎస్, ఎస్‌ఎల్‌ఈ సల్ఫేట్లు వాడతారు. ఇవి 2 శాతానికి మించి ఉంటే ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. స్నానం చేశాక చిన్నారి సువాసనతో నిండిపోవాలి అనుకుంటాం కానీ ఇవి కృత్రిమ వాసనలే. దీనికోసం ఫ్తలేట్స్‌ని వాడతారు. ధర తక్కువని సంస్థలూ ఈ సింథటిక్ ఫ్రాగ్రెన్స్‌కి ప్రాధాన్యమిస్తాయి. ఇవేమో పునరుత్పత్తి, ఎదుగుదల లోపాలు కొన్నిసార్లు క్యాన్సర్‌కీ కారణమవుతాయి. ఉత్పత్తులు ఎంచుకునేప్పుడు ఎస్‌ఎల్‌ఎస్, ఎస్‌ఎల్‌ఈ లేనివీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీవీ ఎంచుకోవాలి. చిన్నారుల కోసం వృక్షాధారిత ఉత్పత్తులు వస్తున్నాయి. వీటిల్లో కోకో గ్లైసనేట్ ఉంటుంది. ఇవి చర్మాన్ని శుభ్రం చేయడంతోపాటు సురక్షితంగా ఉంచుతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నవి తీసుకుంటే సహజ సువాసన ఇస్తాయి.
* పౌడర్.. వాడాలా వద్దా అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. టాల్కమ్ పౌడర్ డస్ట్ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పైగా తయారీలో కలుషితమయ్యే అవకాశమెక్కువ. ఆస్‌బెస్టాస్ వంటి వాటి ఆనవాళ్లూ కనిపిస్తున్నాయి. దీంతో తుమ్ములు, దగ్గు, ఉదర భాగంలో నొప్పి వంటివి వస్తాయి. కానీ పిల్లల్ని దద్దుర్లు, చెమట నుంచి కాపాడటానికని దీన్ని వాడక తప్పదు. కాబట్టి, టాల్క్ ఫ్రీ బేబీ పౌడర్‌నో సహజ ప్రత్యామ్నాయంగా
మొక్క జొన్న పొడినో వాడటం మేలు.
* ఉత్పత్తులు ఎక్కువకాలం నిల్వ ఉండటానికి పారాబెన్స్, ఫార్మాల్డిహైడ్ వంటివి కలుపుతారు. వీటిని చాలా దేశాల్లో నిషేధించారు. వీటివల్లా సంతానోత్పత్తి సమస్యలు, బరువు పెరగడం వంటి వాటికి అవకాశాలెక్కువ. బదులుగా గ్లుకనో లాక్టోన్ ఉన్నవి వాడాలి.
* కాటుక.. కళ్లు పెద్దవి అవుతాయనో, దిష్టనో, కళ్లకి మంచిదనో పెడుతుంటాం. దీనిలో దురద, ఇన్ఫెక్షన్లను కలిగించే లెడ్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన దానిలోనూ కార్బన్ ఉంటుంది. పెట్టేటప్పుడు చేతులు శుభ్రంగా లేకపోయినా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి, వాడొద్దు. పెట్టాల్సొస్తే కాలుపైనో, చెవి వెనకో పెట్టాలి. దాన్నీ స్నానానికి ముందే తుడిచేయాలి.
* డైపర్లు.. పక్కతడవకుండా వేసే షీట్లు, డైపర్లలో ట్రైబ్యుటలిథీన్ (టీబీటీ) ఉంటుంది. దీంతో గుండె, పునరుత్పత్తి అవయవాలకు హాని. బదులుగా సేంద్రియ, వృక్షాధారిత, రసాయన రహిత, బయోడిగ్రేడబుల్, క్లాత్ డైపర్లు వాడాలి.