Movies

నిత్య సత్యాలు

నిత్య సత్యాలు

‘అలా మొదలైంది’తో తెలుగులో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నిత్యా మీనన్‌.. మొదటి సినిమాకే నంది పురస్కారం అందుకొన్నది. ప్రకాశ్‌రాజ్‌ వంటి సీనియర్‌ నటులతో ‘నడిప్పు రాక్షసి’ అని ముద్దుగా పిలిపించుకున్నది. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇటీవల విడుదలైన ‘తిరు’ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో మంచి జోష్‌లో ఉంది కూడా. ఈ సందర్భంగా తన ఆలోచనలను, తాను నమ్మిన సిద్ధాంతాలను షేర్‌ చేసుకున్నది నిత్యా మీనన్‌.

*ఇది నిజం. ఏ సినిమా విజయం అయినా, ఆ చిత్రంలోని స్త్రీ పాత్రల బలంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దర్శకనిర్మాతలు స్త్రీ పాత్రల ప్రాధాన్యాన్ని గుర్తిస్తే.. వాళ్లకూ మేలు జరుగుతుంది. తెలుగులో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఖుషీ, అలా మొదలైంది, ఫిదా.. ఎన్నో ఉదాహరణలు. చివరి వరకూ ఆయా పాత్రల బలం ఎక్కడా సడలిపోదు.

*సినిమాను ఓ కార్పొరేట్‌ ఉద్యోగంలా భావిస్తున్నారు కొందరు. అలా ఉంటే కనుక, ఈ సృజనాత్మక ప్రపంచంలో పాతాళానికి వెళ్తాం. మనం చేసే పనికి తగిన గుర్తింపు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం ‘తిరు’ సక్సెస్‌ కూడా అలాంటిదే. ‘శోభన’ పాత్రలో తమను తాము చూసుకుంటున్నవారు కొందరైతే.. అలాంటి భార్య దొరకాలని కోరుకునేవారు మరికొందరు.

*ఈ మధ్యకాలంలో ప్రతీ సినిమాను అతిగా విశ్లేషిస్తున్నారు. సినిమా అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే ఇంకా బాగుండేది, కచ్చితంగా ఇలా తీస్తేనే ప్రేక్షకులు చూస్తారు?.. అంటూ సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నారు. అంత సత్తా ఉంటే, వాళ్లే వచ్చి తీయొచ్చు కదా. ఓ సినిమాపై వందలకొద్దీ అభిప్రాయాలు వెల్లడవుతాయి. అన్నిటినీ నేను సీరియస్‌గా తీసుకోను. అతిగా విశ్లేషించే సాహసం చేయను. కమర్షియల్‌ సినిమా చేస్తున్నప్పుడు కూడా నన్ను దృష్టిలో ఉంచుకొనే ఆ పాత్రను తీర్చిదిద్దుతున్నారు దర్శకులు. నేను నిజాయతీ ఉన్న కథల కోసం చూస్తున్నాను. నా ఫీలింగ్స్‌కు దగ్గరగా ఉంటే వెంటనే ఒప్పేసుకుంటాను. పాత్ర నిడివి గురించి కూడా ఆలోచించను. చిన్నదైనా, పెద్దదైనా చేసేస్తాను. దక్షిణాదిలో దాదాపు అన్ని భాషలూ మాట్లాడగలను. ఓ కొత్త కథ నా దగ్గరికి వచ్చినప్పుడు, అందుకు నేనే సరిపోతానని దర్శకనిర్మాతలు అనుకుంటే.. తప్పకుండా ఆ ప్రాజెక్ట్‌ చేస్తాను. సినిమాను ఎప్పుడూ రాకెట్‌ సైన్స్‌లా చూడను. నాకు అర్థమైనంతమేర మాత్రమే చేస్తాను. భీమ్లానాయక్‌, 19 1(ఏ) సినిమాల్లో నా పాత్రలు అలాంటివే. ఇక నా నటన అంటారా? అదెప్పుడూ బాహ్యమైంది కాదు. లోలోపలి నుంచి వస్తుంది. నేను స్పాంటేనియస్‌ యాక్టర్‌ని. ఒక్కోసారి సినిమా తాలుకు పాత్రల నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది నాకు.సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం ఒకే ట్రాక్‌లోకి వచ్చాయి. దీనివల్ల ఎంతోమంది అభిమానులు పరిచయమయ్యారు. తీరిక సమయాల్లో వారితో కనెక్ట్‌ కావడం ఆనందంగా ఉంటుంది. సోషల్‌ మీడియా ఎప్పుడూ నా వ్యక్తిగత జీవితంపై చెడు ముద్ర వెయ్యలేదు. ఎంతోమంది ఎన్నో పుకార్లు పుట్టిస్తుంటారు. వాళ్లను పట్టించుకోను. కొన్ని పుకార్లు మరీ తీవ్రంగా ఉంటాయి. వాటికి కొంత సమయం ఇచ్చి.. ఒక్కసారే క్లియర్‌ చేసుకుంటాను. ఇది నేను ఎంచుకున్న, నేను కోరుకున్న జీవితం. నా ఆత్మసాక్షి చెప్పినట్టే నడుచుకుంటాను. ఎవరి ప్రభావానికీ గురికాను.