లవ్‌స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తనకు బోర్ కొట్టాయని..ఇక ముందు ప్రయోగాలకే ప్రాధాన్యతనిస్తానని చెప్పింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ భామ ఓ పోలీస్ కథాంశంలో నటిస్తున్నది. ఈ సినిమా కోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని, మహిళా ఐపీఎస్ ఆఫీసర్స్ జీవన శైలి గురించి తెలుసుకున్నానని చెప్పింది. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘నా పాత్ర కోసం దాదాపు రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నా. కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. యాక్షన్ సీన్స్‌లో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. ప్రేమకథా చిత్రాల్లో నన్ను రక్షించడానికి హీరో ముందుకొచ్చేవాడు. ఇప్పుడు నేనే స్వీయరక్షణ చేసుకోవడం థ్రిల్‌గా ఫీలయ్యాను’ అని చెప్పుకొచ్చింది. పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో తరచూ కనిపించేసరికి ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీలవుతున్నారని, అందుకే కథల ఎంపికలో ప్రయోగాలు చేస్తున్నానని లావణ్య త్రిపాఠి పేర్కొంది. అయితే తాను నటిస్తున్న యాక్షన్ సినిమా వివరాల్ని ఆమె వెల్లడించలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.