‘ఏమాయా చేసావె’ చిత్రంతో జెస్సీగా తెలుగుతెరకు పరిచయమైంది సమంత. ఈ సినిమాలో జెస్సీ పాత్ర అందరి మనసును హత్తుకోవడానికి ప్రధాన కారణం ఆమె గొంతు. జెస్సీగా తన నటనతో సమంత ఎంతగా అలరించిందో అంతే అందంగా ఆమె వాయిస్‌కు డబ్బింగ్ అందించి అందరి మెప్పు పొందారు గాయని చిన్మయి. ఈ సినిమా తరువాత కూడా ఆమె సమంత నటించిన పలు చిత్రాలకు డబ్బింగ్‌ను అందించి గుర్తింపు పొందారు.అయితే తాజాగా చిన్మయి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి… ఆమెతో తన స్నేహం గురించి చెప్పుకొచ్చింది. “ సమంత నాకు మంచి స్నేహితురాలు, మంచి వ్యక్తిత్వం ఆమె సొంతం. ఈ రోజు నాకు గుర్తింపు వచ్చిందంటే అది సామ్ వల్లే. ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవడంతో తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. అందుకు ఆనందంగా వుంది. ఇప్పుడు సమంతకు నేను డబ్బింగ్ చెప్పే దశ దాటిపోయింది.మేమిద్దరం ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆనందంగా మాట్లాడుకుంటాం.. అయితే ఈ విషయాలన్ని అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయాలు బయట చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. మేమిద్దరం కలుసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టకపోయినంత మాత్రాన మేము విడిపోయినట్లు కాదు. మేము కలుసుకున్న విషయాన్ని ఎవరికీ చెప్పం. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం’ అని చెప్పారు చిన్మయి.