బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి జరిగింది. తన పెళ్లి విషయంలో గోప్యత పాటించడానికి కారణమేమిటో కత్రినా కైఫ్ ఇటీవల వెల్లడించింది. ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘పెళ్లికి ముందు మా కుటుంబంలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఫ్యామిలీ మొత్తం ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నాం.ఆరోగ్యపరంగా ఎవరికీ తిరిగి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో కేవలం కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. దాంతో చాలా మంది సన్నిహితులు మా పెళ్లికి దూరమయ్యారు. కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.చాలా మందికి అసలు విషయం తెలియక మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అయితే కొద్ది మంది అతిథుల్ని ఆహ్వానించినా..మా పెళ్లి మాత్రం అద్భుతంగా జరిగింది’ అని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్