సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పూజా కార్యక్రమం స్థానిక పిజిపి హాల్ నందు వినాయక నామ జయజయధ్వానాల నడుమ ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. కొవిడ్ ఆంక్షల కారణంగా రెండు సంవత్సరాల తరువాత ప్రత్యక్షంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు వారి స్వహస్తాలతో అరుదైన 21 పత్రాలతో బాల గణపతి పూజ చేశారు. ప్రత్యేక అలంకరణతో ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుడి ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజలో భాగంగా వేదపండితులు తెలిపిన గణేశ వైభవం, సంస్కృతి, సంప్రదాయాల వివరణ, పూజా కార్యక్రమాన్ని పెద్దలతో పాటు పిల్లలు కూడా అత్యంత ఆసక్తితో ఆలకించారు.
ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు శ్రీ కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని అందించామని, అలాగే సుమారు 500 మందికి అన్ని రకాల 21 పత్రిని ఉచితంగా పంచి తృప్తి చెందామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన పూజా కార్యక్రమానికి సుమారు 500 ప్రత్యక్షంగా, 3500 మంది అంతర్జాలం ద్వారా వీక్షించడం జరిగిందని తెలిపారు. అందరి మంచి కోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు.