కెనడా కాల్గరీలోని శ్రీ అనఘా దత్త సొసైటీలో (శ్రీ సాయి బాబా మందిరం) గణపతి నవరాత్రుల సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్మాతలు లలిత, శైలేష్, వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ.. అనేక మంది వాలంటీర్లతో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాల్గరీ Downtown వీధిలో గణపతి ఉత్సవ ఊరేగింపు ఘనంగా జరిగినది. 400 మందికి పైగా భక్తులు మేళ తాళాలతో, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామ స్మరణలో పాల్గొన్నారు. ‘గణపతి ఉత్సవ ఊరేగింపు’ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఉత్సవంలో Canada పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన జస్రాజ్ హల్లాన్ పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను, హాజరైన వారిని అభినందించారు.
ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, గురువందనం, చతుర్వేద పారాయణం, వినాయక చవితి పూజలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. పంచాయతన పూజలు, యాగాలు నిత్య పూజలు అయిదు సంవత్సరాలకు పైగా భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకులు లలిత, శైలేష్ గణపతి నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పారాయణ, నిత్య అగ్నిహోత్రం, పూజలు, యాగాల వల్ల ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కఠోర వ్యాధులు ప్రబలకుండా భగవంతుడు కాపాడతాడు. సర్వేజనా సుఖినోభవంతు, దైవ స్మరణలతో, 800 మంది భక్తుల ఆలయ సందర్శనతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
Canada కాల్గరీ, Edmonton, చుట్టు ప్రక్కల ప్రాంతంనుండి చాలా భక్తులు రావడం విశేషం. శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ అనేది.. షిర్డీ సాయిబాబా, అనంత పద్మనాభస్వామి, అనఘా దేవి, శివుడు, హనుమంతుడు, గణేశుడు మరియు కార్తికేయ దేవతలను కలిగి ఉన్న ఆలయాన్ని నిర్వహించే ఒక నమోదిత స్వచ్ఛంద సంస్థ. ఆలయంతో పాటు శాస్త్రీయ సంగీతం, నృత్య కార్యక్రమాలతో సహా వివిధ సాంస్కృతిక, సాంప్రదాయ కార్యక్రమాలకు కూడా సంస్థ మద్దతు ఇస్తుంది. అందరికీ ఆ గణనాథుడి ఆశీస్సులు పరి పూర్ణంగా ఉండాలని వేద పండిట్ రాజకుమార్ వేద ఆశీర్వచనంతో క్రతువులు పరిసమాప్త మయ్యాయి. అతిథులు మహా నేవేద్యం తీసుకుని దైవకృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఎంపీకి, వాలంటీర్లకు శైలేష్ భాగవతుల కృతజ్ఞతలు తెలిపారు.