NRI-NRT

రిషి సునాక్‌పై…21వేల మెజార్టీతో గెలిచిన లిజ్ ట్రాస్

రిషి సునాక్‌పై…21వేల మెజార్టీతో గెలిచిన లిజ్ ట్రాస్

బ్రిటన్‌ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌ ట్రస్‌(Liz Truss) విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌( Rishi Sunak), లిజ్‌ ట్రస్‌(Liz Truss)కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా లిజ్‌ రికార్డు సృష్టించారు. లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకొనేందుకు గడిచిన ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్‌ జరిగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21వేల ఓట్ల తేడాతో సునాక్‌పై లిజ్‌ పైచేయి సాధించారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్‌ ట్రస్‌ తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ధైర్యమైన ప్రణాళికలను అందిస్తానన్నారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించనున్నట్టు తెలిపారు.