రాచరీక నిబంధనల కారణాన గల్ఫ్(Gulf) దేశాలలో బాహ్య ప్రదర్శన పరిమితమైనా భగవంతుని అథ్యాత్మిక చింతనకు మాత్రం ఆకాశమే హద్దు.. అందుకే ఎడారి దేశాలలో వినాయకుడు ఏలాంటి విఘ్నాలు లేకుండా భక్తుల పూజలందుకొంటున్నాడు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. భారతీయులు నివాసముంటున్న దాదపు అపార్ట్‌మెంట్లలో విఘ్నాధిపతికి అర్చన సాగుతుంది. దుబాయి, మస్కట్, మనమాలలోని కృష్ణ మందిరాలలో ప్రతిష్ఠించిన గణపయ్యను నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించి పూజలు చేస్తున్నారు. ఈ మూడు చోట్ల మినహాయించి మిగిలిన ప్రదేశాలలో దాదపుగా రెండు, మూడు రోజులకే నిమజ్జనం జరుగుతుంది. భారతదేశంలో తరహా కాకుండా గల్ఫ్ దేశాలలో రెండు, మూడు రోజులకు మాత్రమే నిమజ్జనం చేస్తుంటారు.
యు.ఏ.ఇ.లోని దుబాయిలోని బర్ దుబాయి, కరామా ప్రాంతాలలో గత మూడు రోజులుగా గణపతి పూజలు ఊపందుకొన్నాయి. అనేక మంది భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని అరేబియా సముద్రంలో నిమజ్జనం చేస్తున్నారు. దుబాయిలో తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన పారిశ్రామికవేత్త కేసరి త్రిమూర్తులు ఆజ్మాన్‌లోని తన మైత్రీ ఫాంలో ప్రతిష్ఠించిన గణపతి ఈ సారి తెలుగు ప్రవాసీయులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుబాయి, షార్జా ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రవాసాంధ్రులు నిత్యం సందర్శించి పూజలు చేసిన గణనాథుడిని ఆదివారం నిమజ్జనం చేసారు. వినాయక చవితి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి 500 మందికి అన్నదానం కూడా చేసారు. అరేబియా సముద్రంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేయడం సంతోషం కలిగించిందని దుబాయిలో పని చేసే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన బిరదారీ సతీష్ కుమార్ చెప్పారు. దుబాయిలోని జబల్ అలీతో సహా వివిధ ప్రాంతాలలోని లేబర్ క్యాంపులలో కార్మికులు భక్తితో ప్రతిష్ఠించిన గణపతి పూజలందుకోన్న రెండు,మూడు రోజులకే నిమజ్జనం అయ్యాడు.
ఒమాన్‌లో ..
మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిరంలో వినాయకునికి ప్రతి సంవత్సరం పూజలు చేస్తే కలిగే అనుభూతి వర్ణనాతీతమని మస్కట్‌లో నివాసముండే మచిలీపట్నంకు చెందిన గృహిణి కె. మమత చెప్పారు. రాజధానిలోని మున్సిపల్ లేబర్ క్యాంపులలో తెలంగాణ ప్రవాసీయులు ఏర్పాటు చేసుకోన్న వినాయకుల వద్ద రాత్రి వేళ భక్తులతో సందడిగా ఉంది.
బహ్రెయిన్‌లో..
బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి ప్రతి రోజు భారీ సంఖ్యలో భక్తులు సందర్శించుకొంటూ పూజలు చేస్తున్నారు. గతంతో పోల్చితే, కరోనా కారణాన ఈ సారి బహ్రెయిన్‌లో వినాయక చవితి సందడి కొంచెం తగ్గింది. బహ్రెయిన్‌లో ప్రఖ్యాతి గాంచిన ఎ.యం.ఏ క్యాంపులోని శివాలయం, బ్రాంకో క్యాంపులోని దుర్గ మాత మందిరంలో ఈ సారి వినాయక చవితి సందడి ఏ మాత్రం లేదు.
కువైత్‌లో..
కువైత్‌లో అనేక అపార్ట్‌మెంట్లలో వినాయక చవితి ఘనంగా జరిగింది. కొన్ని చోట్ల లడ్డూల వేలం జరిగింది. హావళ్లీలో కడప జిల్లా రాజంపేటకు చెందిన ప్రవాసీ ప్రముఖుడు మర్రి కళ్యాణ్ కుమార్ ప్రతిష్ఠించిన వినాయకుడు రాయలసీమ వాసులు అనేకులను ఆకర్షించాడు. కడపకు చెందిన హన్మంత రెడ్డి వేలంలో లడ్డూను కొనుగోలు చేసినట్లుగా కళ్యాణ్ కుమార్ చెప్పారు.
సౌదీ అరేబియాలో..
సౌదీ అరేబియాలో రియాధ్, దమ్మాం, జుబైల్ నగరాలలో తమ ఇళ్ళలలో భక్తి శ్రధ్ధలతో గణపతి పూజలు చేసి నిమజ్జనం చేస్తున్నారు. జెద్ధాలోని తమ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో విష్ణుసహస్ర నామం జపించి హోమం, గణపతి పూజలు నిర్వహించినట్లుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మల్లేశన్ అన్నారు.