Politics

భూములు తిరిగి తీసుకుంటాం: కేటీఆర్

భూములు తిరిగి తీసుకుంటాం: కేటీఆర్

ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలను స్థాపించకపోతే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఇప్పటికే 1234 ఎకరాలను వాపసు తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాల్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, పరిశ్రమలు, స్టూడియోల పేరుతో భూములను దుర్వినియోగం చేశారని విమర్శించారు. రాష్ట్ర శాసనసభ, మండలి మంగళవారం 8 బిల్లులకు ఆమోదం తెలిపాయి. అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత భూముల క్రమబద్ధీకరణ చట్టసవరణ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘పరిశ్రమల కోసం భూములు తీసుకొని జాప్యం చేసినా… ఉపాధి లక్ష్యాలను సాధించకపోయినా కేటాయింపులను రద్దు చేస్తున్నాం. ముషీరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 136.4 ఎకరాలను 58 సంస్థలకు పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించారు. 2003లో జీవో నంబర్‌ 20 ద్వారా కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ బయటకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం 36 సంస్థలే అక్కడ నడుస్తుండగా… మరో 22 సంస్థలు తమ భూములను సబ్‌లీజుకు ఇచ్చాయి.  లీజు గడువు ముగిసినందున ఆయా భూముల్లో కొంత మేరకు క్రమబద్ధీకరించాలనీ, మిగిలిన భూములను ప్రజోపయోగ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించాం. ప్రస్తుతం నడుస్తున్న సంస్థలకు 100 శాతం రిజిస్ట్రేషన్‌ ధరతో క్రమబద్ధీకరిస్తాం. అర్హత గల ఇతర సంస్థలకు 200 శాతం రిజిస్ట్రేషన్‌ ధరతో క్రమబద్ధీకరిస్తాం.రాంనగర్‌లోని చేపలమార్కెట్‌ను అజామాబాద్‌కు తరలించి అక్కడ ఆధునిక రీతిలో నిర్మిస్తాం. దీంతో పాటు వాణిజ్యపరమైన అవసరాలకూ అజామాబాద్‌ భూములను వాడుకుంటాం. బస్‌భవన్‌కు ఉన్న స్థలంలో ఒకవైపు కొంత తీసుకొని, మరోవైపు కొంత ఇస్తాం’’ అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. మూతపడిన పరిశ్రమల భూములను ఏం చేస్తారో స్పష్టీకరించాలని కోరారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వారికి ఇవ్వవద్దన్నారు. దీనిపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. హిందూజ విషయంలో అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్నామని తెలిపారు.