మార్గదర్శి కేసులో రామోజీరావుకు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై సోమవారం విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపున వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.
ఈ విషయంపై ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ…”మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మార్గదర్శిలో చేసింది నేరమా కాదా అనే విషయంపై వాదనలు కొనసాగనున్నాయి. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి కేసులో ప్రధాన పాత్ర పోషించబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా మార్గదర్శి కేసులో పిటిషన్ దాఖలు చేయాలని కోరడం జరిగింది. రెండు నెలలు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఇంకా వకాలత్ దాఖలు చేయలేదు. కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా రెండు నెలల నుంచి పిటిషన్ దాఖలు చేయడం ఎందుకు ఆలస్యం అయిందో అర్థం కావడం లేదు. మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాదారుల నుంచి డిపాజిట్లు ఎంతోమంది తీసుకుంటున్నారు వారిని ఒక విధంగా, రామోజీరావును ఒక విధంగా చూడొద్దని కోర్టును కోరడం జరిగింది. డిపాజిట్లు తీసుకోవడం నేరమా కాదా అనేది మాత్రమే కోర్టును అడుగుతున్నాం. ఎవరెవరు డిపాజిట్లు చేశారో వారి పేర్లు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి” అని పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.