ScienceAndTech

ఆఫీసుల్లోకి…రండమ్మా! రండి!! ఉద్యోగులకు TCS ఈమెయిల్

ఆఫీసుల్లోకి…రండమ్మా! రండి!! ఉద్యోగులకు TCS ఈమెయిల్

కొవిడ్‌-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ దిగ్గజాలు వర్క్‌ ఫ్రం హోం మోడల్‌కు స్వస్తి పలుకుతున్నాయి. టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ తమ ఉద్యోగుల్లో 80 శాతం మందిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది. ప్రతి వారం మూడు రోజుల పాటు విధిగా ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు పంపిన అధికారిక ఈమెయిల్‌లో కంపెనీ స్పష్టం చేసింది. సీనియర్‌ ఉద్యోగులు మాత్రం వారానికి పూర్తిగా ఐదు రోజులు కార్యాలయానికి రావాలని టీసీఎస్‌ తేల్చిచెప్పింది. టీసీఎస్‌ సీనియర్‌ లీడర్లు సంస్ధ కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు..కస్టమర్ల కూడా టీసీఎస్‌ కార్యాలయాలను సందర్శిస్తున్న క్రమంలో ఇక వారానికి మూడు రోజులు టీసీఎస్‌ కార్యాలయం నుంచి పనిచేయాలని మీ సీనియర్లు మీకు తెలియచేస్తారని ఉద్యోగులకు పంపిన అధికారిక మెయిల్‌ పేర్కొంది. 2020లో విధుల్లో చేరిన ఉద్యోగులు ఇంతవరకూ కార్యాలయాలకు రాలేకపోయారని, నూతన సభ్యులను స్వాగతించాలని టాటా కోరుకుంటున్నదని, న్యూ కొలీగ్స్‌కు స్వాగతం పలికేందుకు ఇది సరైన అవకాశమని ఈమెయిల్‌లో టీసీఎస్‌ పేర్కొంది. టెస్లా, యాపిల్‌, గూగుల్‌ సహా పలు టెక్‌ దిగ్గజాలు ఇప్పటికే హైబ్రిడ్‌ మోడల్‌లో తమ ఉద్యోగులను కార్యాలయాల నుంచి పనిచేయాలని కోరాయి. ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు కార్యాలయం నుంచి పనిచేయాలని టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ కోరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌కు మారాలని ఉద్యోగులను సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ కోరింది. ఇక హెచ్‌సీఎల్‌, టెక్‌ మహింద్ర సైతం ఇప్పటికే వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ మోడల్‌ను పునరుద్ధరించాయి.