Health

విచ్చలవిడిగా ప్లేట్‌లెట్స్ ఎక్కించకూడదు

విచ్చలవిడిగా ప్లేట్‌లెట్స్ ఎక్కించకూడదు

డెంగీ జ్వరం అనగానే రక్తంలో ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోతాయని భయపడతాం.. ఒక్క డెంగీతోనే కాదు.. వైరల్‌ ఫివర్‌ ఏది వచ్చినా ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతాయి. ఇవి ప్రమాదకర స్థాయిలో అంటే.. పిల్లలకు 20 వేలకంటే దిగువకు తగ్గిపోయినపుడే వాటిని ఎక్కించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది 50 వేలకు తగ్గగానే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలని ఆందోళన చెందుతారని, వైద్యులపై ఒత్తిడి చేస్తారని ప్రముఖ నియోనేటాలజిస్టు డాక్టర్‌ ప్రీతమ్‌ తెలిపారు. ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం జబ్బు కాదు. 50 వేలకు ప్లేట్‌లెట్లు పడిపోగానే బయట నుంచి ఎక్కించాలని తొందర పెడతారు. దీంతో జబ్బు నయమవుతుందని చెబుతారు. అది నిజం కాదు. డెంగీ వైరస్‌ ప్లేట్‌లెట్స్‌ను తీసుకోవడంతో తగ్గిపోతాయి. 20 వేలకంటే తక్కువగా ఉంటే చిన్నపిల్లలకు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి. 50వేల కంటే తక్కువగా ఉన్నపుడు రక్తం కారడం,లివర్‌ సరిగా పని చేయకపోవడం లాంటి లక్షణాలుంటే మాత్రం ఎక్కించాల్సి వస్తుంది. ఇవి కూడా రక్తం పడకుండా ఉండేందుకు మాత్రమేనని గుర్తించుకోవాలి.