అన్ని రంగాలూ కరోనా ప్రభావంతో కుదేలై భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్నప్పుడు ఐటీ రంగం చేతినిండా ప్రాజెక్టులతో కళకళలాడుతూ కనిపించింది. ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం, అదనపు ప్రోత్సాహకాలతో ఉజ్జ్వలంగా వెలిగింది. నిర్వహణ, రవాణా వ్యయాలను తగ్గించుకొన్న కంపెనీలకు బలహీనమైన రూపాయి కారణంగా మారకం రేటు కలిసివచ్చి మరింతగా లాభపడ్డాయి. ఈ జోరులో కొత్త నియామకాలు వెల్లువెత్తాయి. ఇప్పుడదంతా ఒక్కసారిగా మాయమైంది. ఐటీ సంస్థల ఎగుమతుల్లో మూడింట రెండు వంతుల వాటా ఉన్న అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రారంభ సంకేతాలతో ఇక్కడి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఉద్యోగుల వేతన కోతలు, తొలగింపుల హెచ్చరికలతో కలకలం మొదలైంది.
కొవిడ్‌కు ముందు ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ప్రధాన నగరాల ఆర్థిక కార్యకలాపాల్లో వేగవంతమైన వృద్ధికి ఐటీయే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపించాయి. నైపుణ్యం, ప్రతిభ ఉన్న యువతకు అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను ఏటా వేలాదిగా సృష్టించిన రంగమిది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగం 2021 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రత్యక్షంగా 44 లక్షలు, పరోక్షంగా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. అందులో దాదాపు 37శాతం మహిళా ఉద్యోగులు. 2022 ప్రథమార్ధంలోనూ ఎక్కువ ఉద్యోగాలిచ్చిన రంగాల్లో ఐటీ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా అయిదు లక్షల కొత్త ఉద్యోగాలను ఐటీ రంగం సృష్టించిందని అంచనా. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న సగటు ఉద్యోగితో పోలిస్తే, ఐటీలో ప్రారంభస్థాయి ఉద్యోగికి రెట్టింపు కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ఐటీ కొలువులు మెరుగైన జీతమిచ్చేవిగా స్థిరపడ్డాయి.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) లెక్కల ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో భారతీయ ఐటీ కంపెనీల ఆదాయం వంద కోట్ల డాలర్ల నుంచి 22,700 కోట్ల డాలర్లకు ఎగబాకింది. టెక్ కంపెనీలు కేంద్రీకృతమైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, పుణె వంటి నగరాల్లో భారీగా వినియోగ వ్యయ వర్గం పెరిగింది. ఆటొమొబైల్, స్థిరాస్తి, రిటైల్, ఆహారం, వినోదం వంటి రంగాల వృద్ధికి ఈ వర్గం ఎంతగానో దోహదపడింది. అందుకే ఐటీ కంపెనీల్లో వేతన కోతల హెచ్చరికలు కేవలం ఆ రంగంలోని ప్రస్తుత, భవిష్యత్తు ఉద్యోగుల్లోనే కాకుండా ఇతర రంగాలనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారతీయ ఐటీ కంపెనీలు ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు తగ్గి వ్యయ ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. వాటి సేవలకు అతిపెద్ద మార్కెట్లు అయిన అమెరికా, ఐరోపాలో మాంద్యం సంకేతాలు స్పష్టమవుతున్నకొద్దీ లాభాలను నిలుపుకొనేందుకు ఉద్యోగుల వ్యయాలను తగ్గించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలోనే మొదటి నాలుగు పెద్ద కంపెనీల్లో కొత్త నియామకాలు గణనీయంగా తగ్గాయి. ఐటీ కంపెనీలు ఆదాయంలో సగానికి పైగా జీతాలకే వెచ్చిస్తుంటాయి. 2022 ప్రథమార్ధంలో ఐటీ సేవల మార్కెట్ జోరుగా ఉన్నప్పుడు జీతాల పెంపు, బోనస్‌లు, అనుభవజ్ఞుల నియామకం తదితరాల ప్రభావం సైతం లాభాలపై పడింది. చాలా కంపెనీల్లో వలసలు (అట్రిషన్) పెరిగాయి. సబ్ కాంట్రాక్టింగ్ ఎక్కువైంది. సాధారణంగా కంపెనీ సేవలకు డిమాండ్ బాగుండి అట్రిషన్ ఎక్కువైతే ఉద్యోగులకు అధిక చెల్లింపులు జరుగుతుంటాయి. దానికి విరుద్ధంగా ఇప్పుడు కంపెనీలు వేరియబుల్ పే మొత్తాల్లో కోతలకు ప్రయత్నిస్తున్నాయి. మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు విప్రో సంస్థ వేరియబుల్ పే చెల్లించలేదు. జూనియర్లకు మాత్రం 30శాతం కోతతో దాన్ని అందించింది. ఇన్ఫోసిస్ సైతం వేరియబుల్ పేలో ఇదే తరహా కోత విధించింది. పనితీరు ఆధారిత బోనస్‌ల చెల్లింపును టీసీఎస్ వాయిదా వేసింది.
వ్యయాలు తగ్గించుకొనేందుకు కంపెనీలు ఆలోచిస్తున్న సమయంలోనే మూన్‌లైటింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఐటీ ఉద్యోగులు ఖాళీ సమయంలో రెండో ఉద్యోగం చేస్తుండటం (మూన్‌లైటింగ్) తమ కంపెనీల ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని ఇటీవల కొన్ని దిగ్గజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. పైగా ఇంటి నుంచి పనిచేయడం వల్ల డేటా చౌర్యం పెరుగుతోందని సంప్రదాయ టెక్ కంపెనీలు కొన్ని చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ఉద్యోగులను పట్టుపట్టి ఇంటి నుంచి పనిచేయించిన సమయంలో ఈ మూన్‌లైటింగ్, డేటా చోరీ వంటి అనుమానాలు వ్యక్తం కాలేదు. కార్యాలయాలకు రావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం, అందుకు చాలామంది అయిష్టత వ్యక్తం చేసినప్పుడే ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఐటీ కంపెనీల భారీ వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా సహజంగానే ఉద్యోగులు నిర్ణీత గంటలకు మించి అధికంగా పని చేస్తున్నారు. కంపెనీలు మాత్రం కనీస గంటలకే చెల్లిస్తున్నాయి. టెక్ ప్రతిభావంతులకు ఊహించిన దానికంటే ఎక్కువ ఎంపికలున్నాయని గుర్తించేందుకు కరోనా తెచ్చిన ఇంటి నుంచి పనివిధానం తోడ్పడింది. ఈ నేపథ్యంలో నిర్బంధ వైఖరి అనుసరించే కంపెనీలు ప్రతిభావంతుల్ని నిలుపుకోవడం కష్టమవుతోంది. సంప్రదాయ కంపెనీలు ఈ విషయంలో విజ్ఞతతో ఆలోచించి, హైబ్రిడ్ పనివిధానం వంటి ఆమోదయోగ్య మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి ప్రభావం స్టాక్ మార్కెట్లోనూ కనిపిస్తోంది. నిఫ్టీ 50లో ఐటీ షేర్ల వెయిటేజీ గత డిసెంబరులో 19శాతం ఉండేది. ప్రస్తుతం అది 15శాతానికి పడిపోయింది. ఉద్యోగాల సృష్టి, ఎగుమతులతో డాలర్ల ఆర్జన, పన్నుల చెల్లింపుల్లో టెక్ దిగ్గజ సంస్థలు కీలకంగా ఉన్నాయి. ఐటీ రంగంలో ప్రస్తుత స్తబ్ధతను తొలగించే పరిష్కారాలను వేగంగా గుర్తించకపోతే ఉపాధి విధానాల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ఇప్పటికే కంపెనీలు అధిక విలువ ఆధారిత సేవలు, ఆవిష్కరణల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఆటొమేషన్, రోబోటైజేషన్ వైపు మళ్ళే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఏటా ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలతో, నైపుణ్య లేమితో బయటికొచ్చే లక్షల మందికి ఐటీ కొలువులు సాధించడం కష్టమవుతుంది. ప్రాంగణ నియామకాలు తగ్గుతాయి. ఎక్కువ జీతమున్న సీనియర్లకూ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ రంగంలో కేవలం మూడు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారికే డిమాండ్ ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు సైతం రాబోయే నెలల్లో నియామకాలు తగ్గుతాయని ప్రకటించాయి.