DailyDose

కలెక్టర్ పేరుతో డబ్బులు డిమాండ్

కలెక్టర్ పేరుతో డబ్బులు డిమాండ్

‘‘నేను మీటింగ్‌లో ఉన్నాను.. మాట్లాడే పరిస్థితిలో లేను.. అర్జంట్‌గా నాకు డబ్బు కావాలి.. అమెజాన్‌ పేలో డబ్బులు పంపించండి’’.. కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా చిత్రం డీపీగా ఉన్న వాట్సాప్‌ నంబరుతో మంగళవారం ఉదయం పలువురు జిల్లాస్థాయి అధికారులకు వచ్చిన వాట్సాప్‌ సందేశమిది.. కాకినాడ జిల్లా సీపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డ్వామా పీడీ ఇలా పలువురు అధికారులకు సమాచారం రావడంతో.. కలెక్టర్‌ డబ్బులు అడగడం ఏంటి..? మెసేజ్‌ పెట్టడం ఏంటి..? వాట్సాప్‌ డీపీగా కలెక్టర్‌ ఫొటో ఉన్నా.. నంబరు మాత్రం వేరేగా ఉంది..? ఈ సందేశాలు అధికారుల్లో చర్చనీయాంశం అయ్యాయి. రూ.1.50 లక్షలు అడిగినట్లు తెలుస్తోంది. ఓ అధికారి ధైర్యం చేసి కలెక్టర్‌నే నేరుగా విషయం అడిగేశారు. దీంతో అవాక్కయిన ఆమె నేను డబ్బులు అడగడం ఏంటని.. వ్యవహారంపై ఆరా తీశారు. వెంటనే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో మాట్లాడి పరిస్థితి వివరించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా పరిస్థితిపై అప్రమత్తమైన కలెక్టర్‌3 full stop తన పేరుతో వాట్సాప్‌ కాల్‌, సందేశాలు ఎవరు పంపి డబ్బులు అడిగినా స్పందించవద్దని.. ఈ తరహా సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. దీంతో ఆయా శాఖల అధికారులు మిగిలిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌ ముఠా పనే3 full stop
కలెక్టర్‌ పేరుతో మోసపుచ్చింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరి ఓం గుప్తాగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌ నంబరు 70173 02622 ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. గతంలో సీసీఎల్‌ఏ, సర్వే కమిషనర్‌, ప్రకాశం కలెక్టర్‌ పేరుతో ఇలాంటి మోసాలు జరిగినట్లు సమాచారం. ఈ ముఠా గుట్టు పసిగట్టేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టిసారించారు. ఇదిలా ఉండగా కాకినాడ త్రీ టౌన్‌ పరిధిలో సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేశారు.