కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..₹ 10 వేల కోట్లతో 3 రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు..
ఉచిత రేషన్ మరో మూడు నెలలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) భేటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో రైల్వే స్టేషన్లను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దేశంలో న్యూదిల్లీ, అహ్మదాబాద్, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వేస్టేషన్లను రూ.10వేల కోట్లతో కొత్త హంగులు అద్దేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ని 4శాతం పెంచడంతో పాటు కరోనా సమయంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేదలకు పంపిణీ చేస్తోన్న ఉచిత రేషన్‌ను డిసెంబర్ 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మాట్లాడుతూ.. 199 స్టేషన్లను తొలి దశలో ఆధునికీకరించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 47 స్టేషన్లకు టెండర్లు ముగియగా, 32 స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయన్నారు. దిల్లీలో స్టేషన్ అభివృద్ధి పనుల్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మిగతా రెండు నగరాల్లోని రైల్వే స్టేషన్లకు రెండున్నరేళ్లలో కొత్త అందాలు అద్దుతామని వెల్లడించారు. ప్రయాణికులకు ఒకేచోట అన్ని వసతులు సమకూరేలా కెఫిటేరియాలు, ఫుడ్ కోర్టులు, వెయిటింగ్ లాంజ్, పిల్లలు ఆడుకొనేందుకు, వినోద సౌకర్యాలతో పాటు స్థానిక ఉత్పత్తులు విక్రయించుకొనేందుకు వీలుగా ప్రత్యేక వసతులు ఉండేలా రైల్వేస్టేషన్లను తీర్చిదిద్దుతామన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జులై నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ మొత్తం 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత రేషన్ పథకం మరికొన్నాళ్లు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుత గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుండటంతో మరో మూడు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కేంద్ర ఖజానాపై మరో రూ.44,700 కోట్ల మేర అదనపు భారం పడనుందని కేంద్రం తెలిపింది. డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్‌ను కొనసాగించనున్నారు.