వీసా జారీలో అమెరికా వ్యవహరిస్తోన్న తీరు వివాదాస్పదంగా మారింది. వీసా అపాయింట్‌మెంట్ల కోసం భారతీయులు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తుండగా.. చైనా దేశీయులకు కేవలం రెండు రోజుల వెయిటింగ్ లిస్ట్ మాత్రమే ఉండటం గమనార్హం.
అమెరికా విదేశాంగశాఖ వెబ్‌సైట్‌ను పరిశీలించగా.. దిల్లీ ఎంబసీ నుంచి పర్యాటక వీసా (Visitor Visa) కోసం దరఖాస్తు చేసుకునే వారికి అపాయింట్‌మెంట్ వెయిటింగ్ సమయం 833 రోజులుగా చూపిస్తోంది. అంతేగాక, విద్యార్థి వీసా (Student/Exchange Visitor Visas) కోసం 430 రోజులు, ఇతర వలసేతర వీసాలకు (Nonimmigrant Visas) 390 రోజుల వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇక, ముంబయి నుంచి పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 848 రోజులు నిరీక్షించాల్సిందే.
అయితే, ఇదే విజిటర్ వీసా కోసం బీజింగ్ వాసులు దరఖాస్తు చేసుకుంటే వెయిటింగ్ టైం కేవలం 2 రోజులే చూపిస్తోంది. ఇక, పాకిస్థాన్ వాసులకు విజిటర్ వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ లిస్ట్ 450 రోజులుగా ఉంది. విద్యార్థి వీసాలకైతే.. దిల్లీ ఎంబసీ నుంచి చేసే దరఖాస్తు దారులకు వెయిటింగ్ సమయం 430 రోజులుండగా.. ఇస్లామాబాద్‌కు కేవలం ఒక్క రోజు, బీజింగ్‌కు రెండు రోజులే ఉండటం గమనార్హం.
భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూ సమయం భారీగా ఉండటంపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. దీనిపై అప్పట్లో అమెరికా స్పందిస్తూ.. కరోనా వైరస్ విజృంభణ సమయంలో లాక్‌డౌన్ తోపాటు సిబ్బంది కొరత కారణంగా వీసా జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని.. అదే సమయంలో కొవిడ్ అనంతరం వీసాల దరఖాస్తులు పెరగడం కూడా దీనికి ఓ కారణమని పేర్కొంది. అయితే దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. ఈ వీసా కష్టాలపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్‌తో చర్చించారు.