◆ ‘హిట్ లిస్ట్’లో ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్
◆ గులాబీ నేతలపై మవోల కన్ను
◆ ‘టైమ్‌బాంబు’ తరహాలో దాడికి పథకం
◆ సామాజిక, భౌగోళిక అననుకూలతతో వెనకడుగు
◆ రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ నిందితులు కూడా టార్గెట్
◆ మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా
అరాచకాలు పెచ్చుమీరినప్పుడు సమాజంలో ఓ విధమైన తిరుగుబాటు వస్తుంది. అది ఇప్పుడు తెరాస నేతలపై ఎంతో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునే దిశలో ముగ్గురు ఎమ్మెల్యేలను హత్య చేయటానికి పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. టైం బాంబ్కా తరహా దాడికి అంతా సిద్లందం. పరిస్థితులు అనుకూలించలేదు. ఇంతలో పోలీసులకు ఉప్పందింది. లేకుంటే ఓ అవాంఛనీయ సంఘటనకు ముగ్గురు ఎమ్మెల్యేలు బలయ్యేవారు.
అసలేం జరిగిందంటే..?:
ఉత్తర తెలంగాణ గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి.కానీ, మావోయిస్టులు ఎలాంటి హింసకూ పాల్పడలేదు. రాష్ట్రస్థాయి నాయకులు ప్రవేశించినప్పటికీ హింసకు పాల్పడకపోవడం వెనుక టైమ్‌బాంబు తరహాలో దాడి చేసి నింపాదిగా తప్పించుకునే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సామాజిక, భౌగోళిక కారణాలతో..!:
రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేసి నిమిషాల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయే వీలుంది. అదే రామగుండం ఏరియా మొత్తం మైదానప్రాంతం. ఇక్కడ ఎలాంటి హింసకు దిగినా వెంటనే పట్టుబడతారు.
భిన్నాభిప్రాయాలు.. అందంకే..:
అందుకే తొలుత చెన్నూరు,బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మా వోయిస్టులు లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై వారిలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే కావడంతో వీరిపై దాడికి దిగితే.. ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న ఆందోళనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేల విషయంలో సామాజిక కోణం.. రామగుండం ఎమ్మెల్యే విషయంలో భౌగోళిక అననుకూల కారణాలతో రెక్కీ నిర్వహించినా.. దాడికి సాహసించలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
అగ్రనేతల రాకతో కలకలం:
ఉత్తరాన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. గోదావరికి ఇరువైపులా వీరి పోస్టర్లు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజిరెడ్డి బసంత్‌నగర్ పరిసరాల్లో సంచరించడం వెనక కారణాలను కూడా గుర్తించారని సమాచారం. రాజిరెడ్డి ఇక్కడ వైద్యం కూడా చేయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల్లో సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు.
సులువుగా సరిహద్దు దాటేలా..:
ఎలాగైనా దాడి చేయాలని వచ్చిన మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఖాకీలు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మావోలు సంచలన హత్యలు, బహిరంగ దాడులకు సాహసం చేయలేరు. అలాగని హింసకు పాల్పడరన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే ఆర్‌ఎఫ్‌సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) కొలువుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారుల్లో ఒక్కరినైనా టైమ్‌బాంబుతో హతమార్చవచ్చని అనుమానిస్తున్నారు.
ఎందుకంటే..:
అది మావోయిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో పునర్వైభవంతోపాటు నిధులు, కేడర్ రిక్రూట్‌మెంట్‌కు దోహదపడుతుందన్నది వ్యూహం. టైమ్‌బాంబు పెట్టిన వ్యక్తి అది పేలే లోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మావోయిస్టులు క్షేమంగా రాష్ట్ర సరిహద్దులు దాటే వరకూ హత్య లేదా హింస విషయాలు బయటకి రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఇక్కడ అనుమానితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంచారు.