సినిమాలైనా, సీరియల్ అయినా, సోషల్ మీడియా అయినా.. అందులో ఎంత మంచి చెప్పినా.. చెడు తీసుకున్నంత తొందరగా మంచిని బుర్రకు ఎక్కించుకోరు జనాలు. తాము చేసే నేరాల కోసం వీటిని విచ్చలవిడిగా వాడుకుంటారు. అందులో మంచి చెప్పారా? చెడు చెప్పారా? అనేది పక్కనపెట్టి… వాటిని బ్లేం చేస్తారు. అలా దృశ్యం సినిమా పదిసార్లు చూసి ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించింది ఓ యువతి. ఆమె స్నేహ కాంబళె… ఆ యువతిని కర్ణాటక రాష్ట్రం బెలగావి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి, మృతుడి భార్య రోహిణి కాంబళె, స్నేహ ప్రియుడు అక్షయ్ విఠకర్ లను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సంజీవ్ పాటిల్ తెలిపారు.
హత్య తామే చేశామని పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ‘దృశ్యం’ సినిమాను వారు ముగ్గురూ పదిసార్లు చూసినట్లు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారని ఎస్పీ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్ కాంబళె ( 57) ఇటీవల హత్యకు గురయ్యాడు. గతంలో ఆయన దుబాయ్ లో పనిచేసేవారు. కరోనా మహమ్మారి సమయంలో బెలగావిలోని క్యాంపు ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించారు.
సుధీర్, రోహిణిలకు స్నేహ ఒక్కతే కుమార్తె. మహారాష్ట్రలోని పూణేలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని ఇటీవల గుర్తించిన సుధీర్ కుమార్తెను మందలించాడు. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. హత్యకు ఆమె కూడా ప్రోత్సాహం అందించింది. దని ప్రకారం తన ప్రియుడిని పూణే నుంచి బెలగావికి సెప్టెంబర్ 15న పిలిపించిన స్నేహ.. పథకం ప్రకారం ఓ లాడ్జిలో ఉంచింది. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నప్పుడు 17వ తేదీన ఉదయం అక్షయ్ ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు.
సుధీర్ కాళ్ళు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. ఆయన కడుపు, గొంతు, చేతులు, ముఖంపై కత్తితో అక్షయ్ ఇష్టానుసారంగా పొడిచాడు. సుధీర్ మరణించాడని ధ్రువీకరించుకున్నాక అక్షయ్ పూణేకు వెళ్ళిపోయాడు. తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి ఇచ్చిన ఫిర్యాదుతో డిసిపి రవీంద్ర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలా అడిగినా వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలు ఇచ్చారు. అనుమానంతో తల్లి కుమార్తెల ఫోన్ కాల్స్ ను పోలీసులు పరిశీలించారు. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్ తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.