రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో జరిగిన గర్బా కార్యక్రమంలో పాల్గొన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను విసిరారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు ఆదివారం తెలిపారు.అయితే అది ఆయనకు తగలలేదని, తలపై నుంచి వెళ్లి పక్కకు పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే, ఆయన్ని లక్ష్యంగా చేసుకొని విసిరారా? లేక అనుకోకుండా ఎవరైనా ఖాళీ బాటిల్‌ను విసరడంతో అది అటుగా వచ్చి పడిందా? తెలియలేదు.
గర్బా కార్యక్రమంలో కేజ్రీవాల్ అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి బాటిల్‌ను విసరగా అది కేజ్రీవాల్ మీదుగా వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ”బాటిల్‌ను కొంత దూరం నుంచి విసిరారు. అది కేజ్రీవాల్ తల మీది నుంచి వెళ్లింది. అది ఆయన్ను లక్ష్యంగా చేసుకొని విసిరినట్లు అనిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని మేం కచ్చితంగా నిర్ధారించలేం. పోలీసులను సంప్రదించాల్సిన అవసరం లేదు” అని ఆప్ మీడియా సమన్వయకర్త సుకన్రాజ్ తెలిపారు.