Devotional

స్వర్ణరథంపై విహరిస్తున్న శ్రీనివాసుడు

స్వర్ణరథంపై విహరిస్తున్న  శ్రీనివాసుడు

స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం
13

శ్రీవారి న‌వ‌హ్నిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించాడు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వ‌ర్ణ‌ర‌థ‌న్ని లాగారు.

శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరుప్రక్కలా ఉన్నారు. శ్రీదేవి(లక్ష్మి) సువర్ణమయి. ఆమే బంగారు కాగా – ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహా శక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

‘స్వర్ణ’ మంటే ‘బాగా ప్రకాశించేది’ అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమి నుండే. కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం – స్వామివారి మహోన్నతినీ, సార్వభౌమత్వాన్నీ, శ్రీసతిత్వాన్నీ, భూదేవీనాథత్వాన్నీ సూచిస్తూంది.
12
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ స‌న‌త్ కుమార్, శ్రీ నంద‌కుమార్‌, శ్రీ మారుతీ ప్ర‌సాద్‌, జెఈవోలు శ్రీ మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
11