‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తుంటే మావోయిస్టుల్లో చేరి వాళ్లను చంపాలని ఉంది’’ అంటూ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ‘‘నా శరీరం సహకరించడం లేదు కాబట్టి నేను ప్రస్తుతం ఆ పని చేయలేను’’ అంటూ ముక్తాయింపు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ సమస్య ఉన్నా నక్సల్స్ మళ్లీ వస్తారని, కోల్ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, చెన్నూరు, బెల్లం పల్లి ఎమ్మెల్యే లకు ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజా ప్రతినిధులు పద్ధతి మార్చుకోకపోతే నక్సల్స్ చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. మెడికల్ మాఫియా, ఉద్యోగాల మాఫియా పట్ల మావోయిస్టులు సీరియస్ గా ఉన్నారన్న ఆయన… శాసన సభ్యుల ఆస్తులు, అవినీతి సంపాదనపై సీఎం కేసీఆర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరాచకాలు, దోపిడీపై మీ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీని ఆక్రమించారన్న ప్రకాష్ రావు… రాబోయే రోజుల్లో మావోయిస్టులు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అందుకే పోలీసులు కూడా కూంబింగ్ లు చేస్తున్నారన్నారు.
మావోయిస్టులు అఫెన్స్ చేసి 10 నిమిషాల్లో బార్డర్ దాటి వెళ్లిపోయే అవకాశం ఉందని, ఎమ్మెల్యేలు జాగ్రత్త! అంటూ ప్రకాష్ రావు కామెంట్స్ చేశారు. తనకు ఓపిక లేదు గానీ.. శరీరం సహకరిస్తే.. తనకే ఓ పది మందిని తీసుకెళ్లి మావోయుస్టుల్లో చేరి ఎమ్మెల్యేలను చంపాలని అనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూసి అలా చేయాలనిపిస్తోందన్న ఆయన.. వారు అక్రమాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యేల అక్రమాల ఆధారాలు సేకరిస్తున్నానని, వాటిని సీఎంకు పంపిస్తానని స్పష్టం చేశారు. “తెలంగాణ వచ్చిన తర్వాత నక్సల్స్ అజెండా నా అజెండా అన్నారు కేసీఆర్… మావోయిస్టులు కూడా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు” అని ప్రకాష్ రావు చెప్పారు. నక్సల్స్ బలం ఎంతో కేసీఆర్ కి బాగా తెలుసన్న ఆయన… కేసీఆర్ మంత్రిగా ఉన్నపుడు నక్సల్స్ లేఖలు రాశారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నక్సల్స్ బలహీన పడ్డారని, చర్చలకు రావడం వల్ల నష్టపోయామని నక్సల్స్ చెప్తున్నారని ప్రకాష్ రావు వివరించారు.