NRI-NRT

MGMNT వద్ద గాంధీజీ జయంతి

MGMNT వద్ద గాంధీజీ జయంతి - Gandhi Birthday Celebrated At MGMNT Irving

డాలస్‌లోని అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలి వద్ద మహాత్ముని జయంతి వేడుకలను ‘మహాత్మా గాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌(ఎంజీఎంఎన్‌టీ)‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌’ అధ్యక్షుడు ఉర్మీట్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది వేడుకల్లో ఎప్పటిలాగే ‘గాంధీ శాంతి నడక’ను కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. గాంధీ జయంతి రోజును ‘అంతర్జాతీయ అహింస దినోత్సవం’గా పాటించాలని ఐరాస నిర్ణయించడం.. విశ్వ మానవాళి మొత్తం ప్రపంచ శాంతికాముకుడైన బాపూజీకి ఘన నివాళి అర్పించినట్లేనని ఎంజీఎంఎన్‌టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్‌ తోటకూర తెలిపారు.

ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ఇర్వింగ్‌ నగర కౌన్సిల్‌ సభ్యుడు మార్క్‌ జేస్కి, నగర పోలీస్‌ చీఫ్‌ డెరెక్‌ మిల్లర్‌లు మాట్లాడుతూ.. ప్రవాస భారతీయులు నగర అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. గాంధీకి నివాళులర్పించే అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. సంస్థ కార్యదర్శి రావు కల్వల స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాంతి నడకలో పెద్దసంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. 18 ఎకరాల సువిశాల పార్క్‌లో ఉత్సాహంగా నడక సాగించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన నగర మేయర్‌ రిక్‌ స్తోఫెర్‌ మాట్లాడుతూ.. తమ నగరంలో అమెరికాలోనే అతి పెద్దదైన గాంధీ స్మారక స్థలి ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. ఇర్వింగ్‌ నగరం తరఫున అక్టోబర్‌ 2ను ‘గాంధీ డే’గా ప్రకటిస్తూ జారీ చేసిన అధికారిక ధ్రువపత్రాన్ని ఛైర్మన్‌ డా.ప్రసాద్‌ తోటకూర, బోర్డు సభ్యులకు అందజేశారు. ఉర్మీట్‌ జునేజా, సల్మాన్‌ ఫర్షోరి, ఇందు మందాడి, తైయాబ్‌ కుండవాలా, పీయూష్‌ పటేల్‌, పులిగండ్ల విశ్వనాథం, మురళి వెన్నం, రన్నా జాని, రామ్కి చేబ్రోలు, షబ్నం మొద్గిల్‌, శైలేష్‌ షా, గోపాల్‌ సోనంగి, ములుకుట్ల వెంకట్‌, సాంటే చారి, సత్యన్‌ కళ్యాణ్‌ దుర్గ తదితరులు పాల్గొన్నారు. అనంతరం.. ఇర్వింగ్‌ ఆర్ట్స్‌ సెంటర్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘రేడియో సురభి’ జట్టు సభ్యులు రాజేశ్వరి ఉదయగిరి, రవి తూపురాని తదితరుల ఆధ్వర్యంలో వేడుకలు సాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ‘కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ అసీం మహాజన్‌ మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేళ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గాంధీ సిద్ధాంతాలు సదా ఆచరణీయమని పేర్కొన్నారు.