Politics

కాంగ్రెస్ టికెట్ ఆశావహులకు ఖర్గే శుభవార్త

కాంగ్రెస్ టికెట్ ఆశావహులకు ఖర్గే శుభవార్త

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50% సీట్లు 50 ఏళ్ల వయసులోపు వారికే కేటాయిస్తామని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల ప్రచార నిమిత్తం శనివారం విజయవాడ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో ఎన్నిక అనివార్యమైంది. అందరి సూచనలతో పోటీలో నిలిచాను. నా తల్లి, సోదరుడు, సోదరి రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి త్యాగధనుల కుటుంబం నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నా. భాజపా, ఆరెస్సెస్‌ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే బలం నాకివ్వాలని పార్టీ ప్రతినిధులను కోరుతున్నా. అధ్యక్షుడిగా గెలిచాక ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌ అమలుచేసి అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యం కల్పిస్తాన’ని ఖర్గే తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ గొప్ప రాష్ట్రం. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్లెందరో దేశాన్ని నిర్దేశించారు. వారిలో కాంగ్రెస్‌ నాయకులూ ఉన్నారు’ అని గుర్తుచేశారు.