ScienceAndTech

త్వరలో ఆర్బీఐ “ఈ-రూపీ”

త్వరలో ఆర్బీఐ “ఈ-రూపీ”

భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యింది. ‘ఈ-రుపీ’గా వ్యవహరించే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని త్వరలో పైలట్‌ లాంఛ్‌ చేయనున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. కేంద్ర బ్యాంకులు డిజిటల్‌ రూపంలో జారీచేసే కరెన్సీ నోట్లను సీబీడీసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్‌ రుపీని ఆవిష్కరించనున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిచ్చేదృష్టితో కొన్ని సందర్భాల్లో వినియోగానికి మాత్రమే పనికివచ్చే ఈ-రూపీ..పేమెంట్‌ సిస్టమ్స్‌ను మరింత సమర్థవంతం చేస్తుందని, మనీలాండరింగ్‌ అరికట్టవచ్చని తెలిపింది. సీబీడీసీపై ఆర్బీఐ విడుదల చేసిన ఒక అవగాహనా పత్రంలో ఈ కొత్త సాధనం గురించి సూత్రప్రాయంగా వివరించింది. ఆ వివరాలివి…

*** ప్రస్తుత నగదు సాధనాలకు సీబీడీసీ అదనం. అంతేగానీ ప్రత్యామ్నాయం కాదు. యూజర్లకు అదనపు చెల్లింపు సాధనంగా పనిచేస్తుంది.
*** ఇప్పటికే దేశంలో ఉన్న పేమెంట్‌ సిస్టమ్స్‌ సమర్థవంతంగా, సురక్షితంగా, చౌకగా పనిచేస్తున్నాయి. డిజిటల్‌ రుపీ (ఈ-రూపీ) సిస్టమ్‌ భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను మరింత విస్త్రతపరుస్తుంది.
*** సీబీడీసీని ప్రయోగాత్మకంగా విడుదల చేసే సందర్భంగా, చేసిన తర్వాత క్రమేపీ ఈ-రుపీ ప్రయోజనాల్ని, ఫీచర్లను ఎప్పటికప్పుడు ఆర్బీఐ ప్రజలకు తెలియపరుస్తుంది.
*** సీబీడీసీని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి రిటైల్‌ (సీబీడీసీ-ఆర్‌), మరోటి హోల్‌సేల్‌ (సీబీడీసీ-డబ్ల్యూ). రిటైల్‌ సీబీడీసీ వినియోగం కోసం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎంపికచేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగించుకునేలా హోల్‌సేల్‌ సీబీడీసీని డిజైన్‌ చేస్తారు.
*** ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కేంద్ర బ్యాంక్‌లు సీబీడీసీపై ఆసక్తి కనపర్చాయి. కొన్ని కేంద్ర బ్యాంక్‌లు పైలట్‌ ప్రాతిపదికన రిటైల్‌, హోల్‌సేల్‌ విభాగాల్లో సీబీడీసీని అమలు చేస్తున్నాయి. మరికొన్ని కేంద్ర బ్యాంక్‌లు ఈ అంశమై రీసెర్చ్‌, టెస్టింగ్‌ చేస్తున్నాయి.
*** సీబీడీసీలపై ప్రజల్లో అవగాహన కల్గించడానికి ఈ పత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆర్బీఐ వివరించింది.
*** సీబీడీసీ కోసం రెండు అంశాల్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నామని ఆర్బీఐ తెలిపింది. అవి..దాదాపు కాగితపు కరెన్సీకి దగ్గరగా ఉండేలా డిజిటల్‌ రుపీని సృష్టించడం, డిజిటల్‌ రుపీ జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటం.